అవినీతి అధికారులపై ఏసీబీ పంజా

  • 4 నెలలు.. 80కేసులు.. 100 మంది అరెస్టు
  • ఏప్రిల్ నెలలో ఏకంగా 21 కేసులు
  • దాడుల్లో వందల కోట్ల ఆస్తులు గుర్తింపు..
  • ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులపై కూడా దృష్టి పెట్టనున్న ఏసీబీ..
  • ఏసీబీపై నమ్మకం పెరిగేలా చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ పరుగులు పెడుతోంది. గడచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో 80 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాదాపు రూ. 600 కోట్ల మేరకు స్థిర, చరాస్థులను సీజ్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన 100 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. సగటున ప్రతి మూడు రోజులకు ఇద్దరు అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ తనదైన శైలిలో అవినీతి పరుల భరతం పడుతున్నారు. మునుపటి కేసులకు సంబంధించి కీలక సాక్ష్యాదారాలను కోర్టుకు సమర్పించి ఆరుగురు అవినీతి పరులకు జరిమానాలతో పాటు జైలు శిక్షలు ఖరారయ్యేలా చర్యలు తీసుకున్నారు.

జిల్లాల్లోని ఏసీబీ డీఎస్పీలతో డీజీ విజయ్ కుమార్ ప్రతీరోజూ నేరుగా మాట్లాడుతూ అవినీతి కట్టడికి వ్యూహాలు రచిస్తున్నారు. అవినీతికి కేరాఫ్ గా నిలుస్తున్న రెవెన్యూ, పోలీసుశాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల కాలంలో నమోదైన కేసులలో రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల్లో నమోదైన 100 కేసులలో పోలీసు శాఖకు చెందిన సీఐ, ఎస్, కానిస్టేబుల్, హోంగార్డులపై 25 కేసులు నమోదయ్యాయి. అలాగే రెవెన్యూ శాఖకు చెందిన 25 మంది లంచావతారులు ఏసీబీ వలకు చిక్కారు. ఈ నేపథ్యంలో అవినీతిలో అటు పోలీస్, ఇటు రెవెన్యూ శాఖలు పోటాపోటీగా ముందు వరుస లో ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మూడవ స్థానంలో మున్సిపల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో గడచిన 120 రోజుల్లో 80 కేసుల్లో 100 అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నేప థ్యంలో 100 మంది నిందితుల నుంచి దాదాపు రూ. 17 లక్షల నగదును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7 ఆదాయానికి మించి ఆస్తుల కేసులను ఏసీబీ నమోదు చేసింది. తాజాగా కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరాం ఆస్తులపై దర్యాప్తు సాగుతోంది. అటు ఆదాయానికి మించిన కేసులు, ఇటు ఏసీబీ ట్రాప్ వెరసినిందితులకు సంబంధించిన రూ.600 కోట్ల మేరకు స్థిరచార స్థులను ఏసీబీ సీజ్ చేసింది. మరోవైపు ప్రభుత్వ పథ కాలలో అక్రమార్కుల చేతివాటంపైనా నిఘా సారిస్తోంది.

ఏప్రిల్ 10న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ సీఐ బరపాటి రమేశ్. మరో కానిస్టేబుల్ లారీ ఆపరేటర్ అద్దె టిప్పర్లో కంకర రవాణా చేస్తుండగా కేసు నమోదు చేసి రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఏప్రిల్ 18న మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ జ్యుడీషియల్ రిమాండ్ నుంచి విడిపించిన సొమ్మును ఇచ్చేందుకు రూ. 30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కోర్టు ఆర్డర్ నుంచి వచ్చిన రూ. 2లక్షలు ఎస్ఐ తీసుకున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.

ఏప్రిల్ 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ సోమ సతీశ్ కుమార్ భూ వివాదంలో రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.3లక్షలు తీసుకుని మరో రూ. లక్ష తీసుకుంటుండగా పట్టుబడ్డారు.

ఏప్రిల్ 28న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శామీర్ పేట ఎస్ఐ పి.పరశురామ్ చీటింగ్ కేసులో సహకరించేందుకు రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

మహబూబాబాద్ మోటార్ వెహిల్ ఇన్స్పెక్టర్ (ఎఫ్ఎసీ) మహ్మద్ గౌస్ పాషాపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఏప్రిల్ 25న నా లుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం సుమారు రూ.3.51 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. సోదాల్లో రెండు ఇళ్ల పత్రాలు. 25-ఓపెన్ ప్లాట్ డాక్యుమెంట్లు, మూడున్నర ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించినట్లు తెలిపారు. రూ.7లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ. 32 లక్షల విలువ చేసే కారు, 2 బైకులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏసీబీ అధికారులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కింది స్థాయి అధికారులకు తేల్చిచెబుతున్నారు. ప్ర జల్లో నమ్మకం ఏర్పడినప్పుడే అవినీతి పరుల గుట్టు రట్టవుతుందని వివరిస్తున్నారు. గడచిన నాలుగు నెలల్లో ఏసీబీ అధికారులు సమర్ధవంతంగా పని చేయడం వల్ల ఏసీబీపై ప్రజల్లో నమ్మకం పెరిగిం దన్నారు. అవినీతి పరులపై అందిన ఫిర్యాదులపై ప్రతి ఒక్కరూ సకాలంలో స్పందించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విచారణలో ఉన్న కేసులు, ప్రాసిక్యూషన్ ఉత్తర్వులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న కేసులు, ముసాయిదా తుది నివేదికలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, ట్రయల్స్ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశించారు.