ఆర్టీఐ కమిషనర్లుగా అధికార పార్టీ నేతలకు అవకాశం ఎలా ఇస్తారు..?

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో నిబంధనలకు నీల్లొదిలిందని సమాచార హక్కు కార్యకర్త దేవులపల్లి కార్తీక్‌ రాజు ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీఐ చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తూ కమిషనర్‌ నియామకాలు చేపట్టిన జాబితా వెలుగులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.

అందులో ఒకరు సీఎం పీఆర్వో, మరొకరు గాంధీభవన్‌ పీఆర్వో, ఇంకొకరు కోదాడకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న వ్యక్తులకు ఆర్టీఐ కమిషనర్‌గా అవకాశం ఇవ్వద్దని తీర్పులున్నాయని, సెక్షన్‌ 15 (6) నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేశారు. ఆ జాబితాను ఆమోదించవద్దని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలోనూ రిజర్వేషన్లు పాటించలేదని వాపోయారు. న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.