సమాచార హక్కు చట్టం-2005 పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. సహ చట్ట కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ పదవిని దాదాపు ఐదేళ్లకు భర్తీ చేసింది. ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ), ఏడుగురు కమిషనర్ల పేర్లను ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌కు సిఫారసు చేసింది. వీరిలో సీఐసీగా సీనియర్ ఐఎ్‌ఫఎస్ అధికారి జి.చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, కేఎల్‌ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్‌లను ప్రతిపాదించింది. వీరిలో సీఐసీగా చంద్రశేఖర్ రెడ్డి పేరును గవర్నర్ సోమవారం ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏడుగురు సమాచార కమిషనర్ల ఫైల్ పెండింగ్‌లో ఉంది. వీరి నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, సమాచార కమిషనర్లుగా తగిన అర్హతలు లేవంటూ పలువురు ఆర్టీఐ కార్యకర్తలు గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై రెండు రోజుల క్రితం గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వీరి నియామకానికి సంబంధించి గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రాష్ట్ర సీఐసీ పదవి దాదాపు ఐదేళ్లకు భర్తీ అయింది. క్రితం రాజా సదారాంను గత ప్రభుత్వం 2017 సెప్టెంబరులో నియమించగా..ఆయన మూడేళ్ల పదవీకాలం 2020 ఆగస్టుతో పూర్తైంది. తర్వాత సీఐసీ పదవిని భర్తీ చేయలేదు.
చంద్రశేఖర్ రెడ్డి నేపథ్యం…
అదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం బోరేగావ్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 1991 ఐఎ్‌ఫఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఉస్మానియా నుంచి బీఎస్సీ ఫారెస్ర్టీలో డిగ్రీ, దిల్లీలోని జేఎన్‌యూ నుంచి లైఫ్ సైన్సె్‌సలో పీజీ చేసిన ఈయన.. ఐఐఎం బెంగళూరు, యూఎ్‌సఏలోని సిరాక్యూస్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. పర్యావరణ శాస్త్రంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా), ప్రపంచబ్యాంకులకు సంబంధించిన జీవనోపాధి, నీటి వనరుల ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు డైరెక్టర్‌గా సేవలు అందించారు. అడవులు, సహజ వనరులు, వన్యప్రాణుల నిర్వహణలో 34ఏళ్ల అనుభవం కలిగిన ఈయన ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగా, ముఖ్య అటవీ అధికారిగా, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.