చెత్త డంపింగ్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు లిప్ట్ తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.మృతులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు.ఈ సంఘటనతో బుధవారం డంపింగ్‌యార్డ్ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)లు పవర్‌ప్లాంట్‌లో కార్మికులుగా పని చేస్తూ చెత్త డంపింగ్ యార్డ్‌లోని పవర్‌ప్లాంట్ వద్ద గల షెడ్‌లలో తోటి కార్మికులతో కలిసి నివాసం ఉంటున్నారు.
ఎప్పటిలాగానే బుధవారం ఉదయం ప్రాజెక్ట్ ఫేస్ టు చిమ్నీ పొగ గొట్టం వద్ద పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిప్ట్ తెగిపోవడంతో అందులో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు పొగ గొట్టం పైనుంచి కిందపడిపోయారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం యాజమాన్యం ఈసిఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు పవర్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్ వద్ద కొన్ని నెలలుగా పని చేస్తున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.