హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు చిగురుపాటి నమ్రతను రాయదుర్గం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం, వినియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి పోలీసులు 53 గ్రాముల కొకైన్, రూ.10 వేల నగదు అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యురాలు ఇటీవల ముంబైకి చెందిన వాంష్ ధక్కర్ అనే వ్యక్తికి కొకైన్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలిపారు. శుక్రవారం, వాంష్ ఒక ఏజెంట్ బాలకృష్ణ ద్వారా 53 గ్రాముల కొకైన్ ఉన్న పార్శిల్‌ను నమ్రతకు డెలివరీ చేయడానికి పంపాడు. సమాచారం మేరకు రాయదురంలో బాలకృష్ణ నుండి పార్శిల్ తీసుకుంటున్నప్పుడు నమ్రతను తాము పట్టుకున్నట్లు వెల్లడించారు. నమ్రత, బాలకృష్ణ, వంశ్లపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.