ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

  • హాస్పిటల్ నిర్వాహకుడిని రూ.25 లక్షలు డిమాండ్
  • రూ.16 లక్షలకు బేరం కుదుర్చుకున్న పోలీసులు
  • డీఎస్పీ, సీఐపై కేసు నమోదు, కస్టడీకి తరలింపు
  • ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్..

గతంలో వేలలో లంచాలు డిమాండ్ చేసే వారిని చాలానే చూశాం…. పట్టుబడిన వారిని చూసే ఉంటారు… కాని ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తుంది… స్థాయిని బట్టి… అవతలి వ్యక్తిని బట్టి… పరిస్థితులకు అనుగూణంగా లంచాలు తీసుకునే వారు కొత్తగా మార్కెట్లోకి వచ్చారు… వీరు వేలలో లంచం తీసుకోరు… కేవలం లక్షల్లో బేరం చేస్తారు… అవునండి నిజమే ఇటీవల జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం…

మొన్నటికి మొన్న రూ. 70 లక్షలు తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన ఓ ఉన్నతాధికారి ఉద్దాంతం మరువక ముందే మరో భారీ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన తెరమీదకు వచ్చింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా రూ.16 లక్షల లంచం తీసుకుంటూ ఓ డీఎస్పీ, సీఐలు పట్టుబడడం సంచలనం రేపింది. ఇప్పటికే పోలీసులు, రెవెన్యూ, వైద్య, మైనింగ్, అటవీ, రిజిస్ట్రేషన్, పీసీబీ శాఖల్లో లంచం లేనిదే పనులు కావనే అపవాదును మరోసారి నిజం చేస్తూ సదరు అధికారులు వ్యవహరించిన తీరు ఆ శాఖకే మాయమచ్చను తెచ్చిపెట్టింది. సూర్యాపేట జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత జిల్లాలో అర్హత గల డాక్టర్లు లేని పలు ప్రవేట్ ఆసుపత్రులు స్వతహాగా మూసివేయగా, ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు మాత్రం అర్హత లేకుండానే స్కానింగ్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ తరుణంలోనే ఐఎంఏ డాక్టర్స్, సూర్యాపేట డీఎస్పి పార్థసారథికి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సిఐ వీరరాఘవులు కేసు విషయంపై డీఎస్పీ దగ్గర సెటిల్మెంట్ చేసుకోండి అంటూ పంపించాడని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారణ చేసిన ఏసీబి అధికారులు సూర్యాపేట టౌన్ సిఐ, సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి పార్ధసారధి కలిసి, ఫిర్యాదుదారుడు నుండి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసి, 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేసి, సూర్యాపేట పట్టణ సిఐ రాఘవులు, ఎస్పి పార్థసారథిపై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో నల్లగొండ ఏసీబీ ఏఎస్పి కమలాకర్, నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీమ్ పాల్గొన్నారు.