సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ లాబొరేటరీస్)పై తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని హైకోర్టు ఆదేశించింది. అగ్ని ప్రమాదంపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆర్అండ్ డీతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని పీసీబీ ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మైలాన్ లాబొరేటరీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లాబొరేటరీస్ లోని ఒక ఫ్లోర్లో మాత్రమే స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీల రక్షణ విభాగం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పనులు ఆపాలని సూచించింది. దీనికి విరుద్ధంగా పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు నిలిపివేసే అధికారం పీసీబీకి లేదు. ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులైనా జారీ చేయకుండా చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి ఆదేశాల వరకు విద్యుత్ సరఫరా సహా ఇతర పనులపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది.
