
హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుదామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి.. అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణహిత రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు పరితపిస్తున్నారని తెలిపారు. సీఎం ఆశయం.. ఆకుపచ్చ తెలంగాణ. ఆయన ఆశయానికి తగ్గట్లు పనిచేయాలని మంత్రి అటవీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని(ఫిబ్రవరి 17) పురస్కరించుకొని అటవీ సిబ్బంది విరివిగా మొక్కలు నాటాలని మంత్రి తెలిపారు. మొక్కలు నాటడమే కాదు. అవి పెరిగే వరకు సంరక్షణ బాధ్యతలు సైతం తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఫిబ్రవరి 17న మొక్కలు నాటాలని వివరిస్తూ పీసీసీఎఫ్ శోభకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అడవుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.