- ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ఉంది
- అధికార్ల చర్యల్ని సమర్థించాలనుకోవద్దు
- అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి
- లేకపోతే, సీఎస్ సహా అధికార్లంతా జైలుకే
- కంచ గచ్చిబౌలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం: ప్రభుత్వ న్యాయవాది సింఘ్వీ
- తదుపరి విచారణ జూలై 23కు వాయిదా
‘‘వీకెండ్ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు’’ అంటూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లో అడవిని పునరుద్ధరిస్తారో లేదో చెప్పాలని నిలదీసింది. లేకపోతే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా బాధ్యులైన అధికారులందరూ అక్కడే తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళతారని పునరుద్ఘాటించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసిన అంశాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలో జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. తొలుత.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు గత ఆదేశాలను అనుసరించి కంచె గచ్చిబౌలిలో పనులన్నీ ఆపేశామని, వైల్డ్ లైఫ్ సంరక్షణ చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. సీఈసీ నివేదిక బుధవారం రాత్రే తమకు అందిందని, దానికి బదులిచ్చేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.
పునరుద్ధరిస్తారా!? జైలుకు పంపుతారా!?
బుల్డోజర్లతో చదును చేసిన శాటిలైట్ ఫొటోలను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ)కి ఫారెస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా సమర్పించిందని, అక్కడ కేవలం రెండు రాత్రుల్లోనే 104 ఎకరాలకుపైగా చదును చేశారని అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందులో 60 శాతం మోస్తరు, దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీంతో, చెట్ల నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని సీజేఐ బీఆర్ గవాయి ప్రశ్నించారు. చెట్ల ఎత్తు ఆధారంగా సెల్ఫ్ సర్టిఫికెట్ తీసుకున్నామని సింఘ్వీ బదులిచ్చారు. సెల్ఫ్ సర్టిఫికెట్ కాదని, ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ) తీసుకున్నారా? అని సీజేఐ మరోసారి ప్రశ్నించారు. కేవలం 50 హెక్టార్లకుపైగా ఉంటేనే ఈసీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని సింఘ్వీ తెలిపారు. అయితే, ‘‘అక్కడ అటవీ ప్రాంతంలోని చెట్లను నరికేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే. ఈ అంశంలో అధికారులను సమర్థించే ప్రయత్నం చేయకండి. చెట్ల నరికివేతలో ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. లాంగ్ వీకెండ్‌ను ఆసరాగా చేసుకుని.. న్యాయస్థానాలకు సెలవు రోజులని తెలిసి అంత పెద్ద మొత్తంలో చెట్లను నరికేస్తారా? డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి విధ్వంసం చేస్తారా? వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి? సుస్థిర అభివృద్ధికి మేమేమీ వ్యతిరేకం కాదు. మిస్టర్ సింఘ్వీ.. మీరసలు బుల్డోజర్ల ఫొటోలు చూశారా? ఇది పూర్తిగా ముందస్తు ప్రణాళికతోనే జరిగినట్టు కనిపిస్తోంది. కోర్టు ధిక్కరణ నుంచి అధికారులను కాపాడుకోవాలని చూడొద్దు. ప్రభుత్వం ముందు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అడవిని పునరుద్ధరిస్తారో? లేదా అక్కడే నిర్మించే తాత్కాలిక జైలుకు సీఎస్ సహా అధికారులను పంపుతారో నిర్ణయించుకోండి’’ అని సీజేఐ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అడవి పునరుద్ధరణ చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా మొక్కలు నాటుతున్నామని ధర్మాసనానికి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఈ మేరకు ఫొటోలతో కూడిన పూర్తి నివేదికను కోర్టుకు అందజేస్తామని వివరించారు. అయితే, చెట్లు నరికేసిన స్థలంలోనే మొక్కలు నాటుతున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. అయితే, అక్కడ కాకుండా మరోచోట మొక్కలు నాటుతున్నారని ప్రతివాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సింఘ్వీ అభ్యంతరం తెలిపారు. అయితే, వాదనల్లోకి వెళ్లేందుకు కోర్టు నిరాకరించింది. అక్కడ అడవిని పునరుద్ధరిస్తున్నారా? లేదా? అనేదే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఆ స్థలంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశంపై సుమారు ఏడాదిగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. అంతేతప్ప ఇది కేవలం వారాంతంలో తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టం చేశారు. అయితే, చెట్ల నరికివేతను సోమవారం ఎందుకు ప్రారంభించలేదని సీజేఐ ప్రశ్నించారు. దాంతో, తమ తదుపరి నివేదికలో అన్నింటికీ స్పష్టతనిస్తామని సింఘ్వీ బదులిచ్చారు. కాగా, సీఈసీ నివేదికకు కౌంటర్ దాఖలు చేయడానికి ఎంత సమయం కావాలని సీజేఐ ప్రశ్నించగా.. జూలై వరకు సమయం ఇవ్వాలని సింఘ్వీ కోరారు. దీనికి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
అడవి పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద ప్రణాళికేదీ లేదని ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రాబోయే వర్షాకాలం సరైనదని, హైదరాబాద్‌లో మాన్ సూన్ సీజన్ జూన్ 10 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ నిర్మాణాల కోసం ఆలోచన చేస్తోందని, కానీ, పునరుద్ధరణ చర్యలేమీ తీసుకోవడం లేదని తెలిపారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే జూలై వరకు వాయిదా కోరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం ఇటీవల సమర్పించిన నివేదికలోని అంశాలను ప్రస్తావించేందుకు సింఘ్వీ ప్రయత్నించగా, సీజేఐ అడ్డుకున్నారు. చెట్ల నరికివేత ప్రదేశంలో జింకలు, నెమళ్లు స్పష్టంగా ఉన్నాయని, మళ్లీ దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఎందుకని ప్రశ్నించారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సమయంలో విజిల్ బ్లోయర్లు, విద్యార్థులపై కేసులు నమోదు చేశారని సీనియర్ న్యాయవాది వరుణ్ ఠాకూర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 200 మంది విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెట్టారని, ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు రాయాల్సిన కొందరు విద్యార్థులు జైళ్లలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులపై కేసులు కొట్టేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరం మధ్యలోనే మూడు పాఠశాలలను కూల్చివేశారని చెప్పారు. దీనిపై సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసును గతంలోనూ (సీజేఐ కాకముందు) నేనే విచారించాను. ఇప్పటి వరకూ స్కూళ్ల కూల్చివేత ఆరోపణలు రాలేదు. అక్కడికి వెళ్లి పరిశీలించిన అనేక కమిటీలు కూడా తమ నివేదికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు’’ అని వ్యాఖ్యానించారు. తాము కూడా మొదటిసారిగా ఈ ఆరోపణలు వింటున్నామని సింఘ్వీ తెలిపారు. అయితే, సుమోటో కేసుతో కలిపి దీనిని (ఐఏ) విచారించడం కుదరదని, కావాలంటే, మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సీజేఐ సూచించారు. కాగా, ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ.. అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించి తాము స్పష్టమైన ఫొటోలతో కూడిన ఆధారాలు సమర్పించామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, అన్ని పిటిషన్లను సుమోటోతో కలపవద్దని సీజేఐ తెలిపారు. తమ పిటిషన్ మొదటి నుంచీ ఉన్నదేనని, మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకొస్తున్నానని మోహిత్ రావు స్పష్టం చేశారు. తమ పిటిషన్లో బుల్డోజర్లతో చదును, అడవిని నిర్మూలించే, జంతువులు, పక్షులు అక్కడ నివాసం ఉండే ఆధారాలతో కూడిన చిత్రాలు జత చేశామని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. దాంతో, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లోనే అన్నిటినీ పొందుపరిచామని సింఘ్వీ బదులిచ్చారు. అలాగయితే.. ఆ కాపీని మోహిత్ రావుకు అందజేయాలని సీజేఐ ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేశారు.