ఫైళ్ల ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

  • అది సాధారణంగా జరిగే పనే
  • నాకు మాత్రం నయాపైసా వద్దు..
  • కాలేజీకి భవనం కట్టాలని కోరా
  • అరబిందో ఫార్మా రూ.4.5 కోట్లతో కట్టేందుకు ఒప్పుకొంది
  • మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు

తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎ్‌సఆర్‌ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం ఆమె మాట్లాడారు. ‘‘ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాతది కూలగొట్టి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్‌ కూడా నా దృష్టికి తెచ్చారు. ఇందుకు రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దారీతెన్ను తెలియలేదు. మరి నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్‌ కోసం వస్తాయి.

మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్‌ చేస్తారు. అప్పుడు వాళ్లతో నేను అన్నా.. మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్‌ ఒకటి డెవలప్‌ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు.. పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి చెప్పారు. చివరకు సీఎస్ఆర్‌ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది’’ అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్‌, రెండంతస్థులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం తరహాలో పెద్ద హాల్‌, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్‌ విద్యార్థినులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. (సోర్స్: ఆంధ్రజ్యోతి)