నా వ్యాఖ్యలు వక్రీకరించారు..!

  • బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులపైనే స్పందించా
  • అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరణ

ఫైళ్ల క్లియరెన్స్‌ విషయంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు’ తాను వ్యాఖ్యానించినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలపై అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ క్లారిటీనిచ్చారు. వరంగల్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఫైళ్ల క్లియరెన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ పెయిడ్‌ సోషల్‌ మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పని చేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునే వారంటూ అన్న తన మాటలకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

‘కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ కాకతీయ పథకంలో అవినీతిని ‘కమీషన్‌ కాకతీయ’ అని నాటి మంత్రి నాయిని నర్సింహారెడ్డి బయట పెట్టలేదా..? దళిత బంధు పథకం అమలులో ప్రతి ఎమ్మెల్యే 30శాతం కమీషన్‌ తీసుకుంటారని అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా చెప్పలేదా?’ అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ అద్భుత పాలన చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నేతలు తమ సోషల్‌ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎడిటెడ్‌ వీడియో ఒకటి సర్క్యులేట్‌ చేసి తమ క్యాబినెట్‌ సభ్యుల గొడవ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ, వారి ఆశలు నెరవేరబోవన్నారు. సోషల్‌ మీడియాలో ఇంకోసారి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.