ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఇచ్చిన #eachoneplantone (ప్రతీ ఒక్కరూ ఒక మొక్కనాటండి)పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీఎం కేసిఆర్ పేరుతో మొక్కను నాటుదాం. మన అభిమాన నాయకుని మీద జీవితకాలపు గౌరవాన్ని ప్రకటించుకుందాం. ‘‘సెల్ఫీ విత్ సీఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందామని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. #SelfieWithSaplingOnBbirthdayOfLegend పేరుతో పోస్టర్ ను ఎంపీ సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవతో కలిసి ఆవిష్కరించారు.
భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దాం. #greenindiachallenge కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ‘‘రేపటి తరానికి మనం కూడబెట్టాల్సింది ధన సంపద మాత్రమే కాదు…వన సంపద ’’ అనే సీఎం కేసీఆర్ ఆలోచనావిధానాన్ని మనం అనుసరించాల్సిన సమయం వచ్చింది. సీఎం కేసీఆర్ మనందరిలో స్పూర్తిని నింపాలన్న సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో నేను ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మీరంతా ఆదరిస్తుండడం చాలా ఆనందకరమైన విషయం. పచ్చని మొక్కను పసిపాపలా సాదుకుంటున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా.
మొక్కలు నాటుతున్న ప్రతీ ఒక్కరూ ‘సెల్ఫీ విత్ సాప్లింగ్’ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17న అని మనకందరికీ తెలిసిందే. మొక్కలను నాటడం, వాటిని పెంచటం అనేది సిఎం కెసిఆర్ కు చాలా ఇష్టమైన సేవాకార్యక్రమం. కాబట్టి అందరూ ఫిబ్రవరి 17 తేదీన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘సెల్ఫీ విత్ సీఎం సర్ సాప్లింగ్’అనే నినాదం స్ఫూర్తితో మొక్కలు నాటి, సెల్ఫీ దిగి.. వాట్సాప్ నంబర్ 8790909999 కు పంపాలని కోరారు.