- పంట పొలాల మధ్య వాటిని ఏర్పాటు చేయొద్దు
- సింథటిక్స్ కంపెనీ నుంచి ఉదయం, రాత్రి సమయాల్లో పొగ వస్తున్నది..
- దానితో రోగాలబారిన పడుతున్నాం..
- పంటలూ పడడం లేదు..
- స్పష్టంచేసిన మీర్జాపూర్ రైతులు
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్‌లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) కంపెనీ ఉన్నది. ఆ పరిశ్రమ పక్కనే ఆ సర్వేనంబర్‌లోని స్థలంలోనే మరో సింథటిక్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం నిర్వహిస్తామని అధికారులు ముందుగానే ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ రాకపోవడంతో వాయిదా పడింది. అప్పటికే అధిక సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రస్తు తం కొనసాగుతున్న సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) కంపెనీ కాలుష్యంతో చుట్టు పక్కల భూముల్లో పం టలు పండడం లేదని, మనుషులతోపాటు పశువులు కూడా రోగాలబారిన పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం లో పూలు, వరి, మొక్కజొన్న పత్తి తదితర పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చేవని.. సింథటిక్స్ కంపెనీ ఏర్పాటుతో అధికంగా కాలుష్యం, పొగ రావడంతో పంటల దిగుబడి రావడం లేదని రైతులు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్య కారక పరిశ్రమలు పొలాల మధ్య వద్దే.. వద్దంటూ అన్నదాతలు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అధికారులకు తెలిపేందుకు ఇక్కడికి వచ్చామని.. ఉన్నతాధికారులెవ్వరూ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కాలేదన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ భరత్‌ను అడుగగా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో వాయిదా వేసినట్లు చెప్పారు.
కాలుష్యంతో ప్రాణాలకే ముప్పు..
కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంతో రోగాలబారిన పడుతున్నాం. ఉదయం, రాత్రి సమయాల్లో కంపెనీ నుంచి పొగ వస్తున్నది. కిలోమీటర్ వరకు నల్లటి పొగమబ్బులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో కంపెనీతోపాటు మైనింగ్ తవ్వకాలతో నిరంతరం దుమ్ము వస్తున్నది. కాలుష్య నివార ణ, పర్యావరణ శాఖల అధికారులు ఇప్పటివరకూ పరిశీలించిన దాఖలాల్లేవు. కొందరు నాయకుల అండదండలతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాలుష్య కారక పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించేందుకు నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. -శేఖర్ మీర్జాపూర్ గ్రామం, పూడూరు మండలం
గతంలో పూల తోటను సాగు చేసేవాడ్ని..
గతంలో నాకున్న రెండెకరాల పొలంలో పూల తోట, వరిని సాగు చేసేది. గత రెండేండ్ల నుంచి పూలతోటను సాగు చేయడం లేదు. కంపెనీ నుంచి వచ్చే పొగతో రంగు మారి నల్లబడి పాడయ్యాయి. వరి పంట కూడా కాలుష్యంతో సరైన దిగుబడి రావడంలేదు. పొలాల మధ్య నుంచి భారీ వాహనా లు వెళ్తుండడంతో దుమ్మూధూళి పంటలపై పడుతున్నది. పొలాల మధ్య ఉన్న కం పెనీని ఇతర ప్రాంతాలకు తరలించాలి. లేకుం టే పొలాలన్నీ బీడుభూములుగా మారుతాయి.-పెంటయ్య రైతు మీర్జాపూర్ గ్రామం, పూడూరు