24 మంది అదనపు ఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్‌ క్యాడర్‌ విభాగంలో అదనపు ఎస్పీలుగా ఇటీవల పదోన్నతి పొందిన పది మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరోవైపు భారీ స్ధాయిలో డీఎస్పీల బదిలీలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలామందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొంతకాలంగా లూప్‌లైన్‌లో కొనసాగుతున్న వారితో పాటు, ఇటీవల డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసిన డీఎస్పీలకు నూతన బాధ్యతలు అప్పగించడానికి ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నారు.

లా అండ్‌ ఆర్డర్‌ విభాగంతో పాటు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో, ట్రాఫిక్‌ విభాగాల్లో కొత్తవారిని నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దాదాపు రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని లా అండ్‌ ఆర్డర్‌ విభాగాల నుంచి కదిలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో డీఎస్పీ స్ధాయి అధికారులపై ఆరోపణలు వచ్చిన నేపఽథ్యంలో వారిని బదిలీ చేసి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. అలా వెయిటింగ్‌లో ఉన్న వారికి సైతం త్వరలో జరుగనున్న బదిలీల్లో లూప్‌లైన్‌ పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం.