తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వోద్యోగులుగా పనిచేస్తూ.. కాసుల కోసం కక్కుర్తి పడిన ఒక ఉద్యోగి, మరొక ఎస్సై, మధ్యవర్తిని ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామ రైతు గుగ్లావత్ ప్రభాకర్.. మరణించిన తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరుతో పట్టా మార్పిడి చేయాలని మండల సర్వేయర్ పవర్ ఓమాజీని కోరాడు. అందుకు రూ.20 వేలు లంచం అడిగితే, వారం క్రితం ప్రభాకర్ రూ.12 వేలు చెల్లించి.. భూమి పట్టా మార్పిడి తర్వాత మిగతాది చెల్లిస్తానని చెప్పాడు. కానీ మిగతా డబ్బు ఇస్తేనే పని చేస్తానని ప్రభాకర్‌ను ఓమాజీ వేధించాడు. దీంతో విసుగెత్తిన ప్రభాకర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభాకర్ నుంచి రూ.7,000 నగదు తీసుకుంటున్న సర్వేయర్ ఓమాజీని అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట-పాపిరెడ్డి నగర్ ప్రాంతంలో డీజే నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కిరణ్.. ఒక వేడుకలో ఎక్కువ శబ్దంతో డీజే పెట్టినందుకు పర్యావరణ చట్టం కింద జగద్గిరిగుట్ట ఎస్సై శంకర్ కేసు నమోదు చేసి, డీజే వాహనాన్ని జప్తు చేశారు. తనకు జీవనాధారమైన డీజే వాహనం, సౌండ్ బాక్సులు ఇవ్వాలని అప్పటి నుంచి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న కిరణ్‌ను ఎస్సై శంకర్.. రూ.15 వేల లంచం అడిగారు. తనను మానసికంగా వేధించడంతోపాటు లంచం అడిగినందుకు ఏసీబీ అధికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు ఎస్సై శంకర్ మధ్యవర్తి నాగేందర్‌కు కిరణ్ రూ.15 వేల నగదు అందజేశాడు. నాగేందర్ వెంటనే ఎస్సై శంకర్‌కు ఆ సొమ్ము అందించగానే, ఏసీబీ రంగారెడ్డి జిల్లా యూనిట్-1 డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అక్కడే మాటు వేసిన ముగ్గురు ఎస్సైలు, ఇతర సిబ్బంది.. శంకర్, నాగేందర్లను అరెస్ట్ చేశారు. డీఐ నరేందర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు.