మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలి.. వన మహోత్సవంపై అదనపు కలెక్టర్‌ రాధికాగుప్తా

వన మహోత్సవాన్ని ఈ ఏడు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ రాధికాగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కమీషనర్లతో సమీక్ష సమావేశాన్నినిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం ముందుగానే మొదలైనందున ఈ సారి మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవాన్ని మొదలు పెట్టాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. మొక్కలను రోడ్లకు ఇరువైపుల, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంస్థల్లో విరివిగా నాటి లక్ష్యాన్ని సాధించాలన్నారు.

పండ్లు, ఔషధ మొక్కలతోపాటు ఈత మొక్కలను తప్పనిసరిగా 10 శాతం నాటేలా చర్యలు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, మొక్కలు నాటిన స్థలాలను జియో ట్యాగింగ్ ద్వారా (టీజీఎఫ్‌ఎంఐఎస్‌) వెబ్‌సైట్‌లో ప్రతీరోజు నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సాంబశివరావు, జిల్లా అటవీ శాఖాధికారి జానకిరాం, పర్యాటక శాఖాధికారి శ్రీధర్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్ మూర్తి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారి వినోద్ కుమార్, హౌజింగ్ పిడి రమణ మూర్తి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, అటవీ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.