అటవీ చట్టాలు సంస్కరించండి.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి

అడవుల్లో నివసించే గిరిజనుల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోకుండా అటవీ శాఖ చట్టాలను సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఎస్డీఎఫ్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పీఎం జన్మన్‌, ధర్తి అబజన జాతీయ గ్రామ ఉత్కర్స్‌ అభియాన్‌ అనే కేంద్ర పథకాల అమలుపై శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో జరిగిన ఆగ్నేయ రాష్ట్రాల సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేలకుపైగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరా సౌరగిరి జల వికాసం’ పథకం పేరిట పోడు భూములను రైతులు ేసద్యం చేసుకునేందుకు వీలుగా సౌర విద్యుత్తు – పంపుసెట్లను అందించి నీటి పారుదల వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి పథకం ఫలితాలు అడవుల్లోని ప్రతి గిరిజనుడికి అందుతాయని చెప్పారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి మనీష్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రశంసించారు. సమర్ధవంతంగా ఆయా పథకాల అమలుకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్‌, ట్రైఫైడ్‌ ఎండీ హృదేశ్‌ కుమార్‌, ఛత్తీ్‌సగఢ్‌ గిరిజన సంక్షేమశాఖ అధికారి సోన్‌మోని బోరో పాల్గొన్నారు.