తన పేరు, సంతకం ఫోర్జరీ అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ శివారు నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్వా టౌన్‌షిప్ లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మించిన కొంతమంది అందులోని మార్ట్‌గేజ్ ప్లాట్‌లను విడుదలచేస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారు. వాటిపై కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.
సీహెచ్ శివనాగేశ్వరరావు అనే ఓ వ్యక్తి మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్‌ని అంటూ ఒక ఫేక్ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాని ఆధారంగా ఈ ఫోర్జరీకి పాల్పడ్డాడు. ప్లాట్‌లను అమ్మేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా, గండిపేట సబ్‌రిజిస్ట్రార్‌కు మున్సిపల్ కమిషనర్ సంతకంపై అనుమానం కలిగింది. ఈ విషయాన్ని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అది తన సంతకం కాదని ఫోర్జరీ జరిగిందని గ్రహించిన ఆయన నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.