- జిల్లా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలి
- పెండింగ్ రోడ్డు ప్యాచ్ వర్క్ లపై ఆరా తీసిన మంత్రి
- మిగిలిన రోడ్ల ప్యాచ్ వర్క్ లు వెంటనే పూర్తి చేయాలి
- వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు,ఆర్వోబి,ఆర్ యుబి ల పనితీరును సైట్ విజిటింగ్ చేసి పరిశీలించండి
- నిర్మాణంలో ఉన్న వాటి ప్రోగ్రెస్ తో పాటు వాడుకలో ఉన్న వాటి వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయండి
- కేజీ వీల్స్ ట్రాక్టర్స్ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రోడ్ల పై తిరిగితే రోడ్లు దెబ్బతింటాయి
- పంటల సాగు సీజన్ కాబట్టి కేజీ వీల్స్ ట్రాక్టర్స్ రోడ్ల పై తిరుగేటప్పుడు జాగ్రత్తలు పాటించేలా యజమానులకు,రైతులకు అవగాహన కల్పించాలి
- మంచి రోడ్లు – అభివృద్ధికి చిహ్నాలు” నినాదం తో ముందుకెళ్లాలి
- జిల్లా కేంద్రం నుండి గ్రామ స్థాయి వరకు దీనిపై పంచాయతీ రాజ్,రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు వెంటనే చేపట్టండి
- అధికారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశం
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ లో ఆర్ అండ్ బి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలం లో ఆర్ అండ్ బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలనీ సూచించారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి ఇంజనీర్ల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాలు,వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీ కి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వరదల వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు వెంటనే రీ స్టోర్ చేసేందుకు వీలుగా సాండ్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్ ఏ.ఈ స్థాయిలో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉదృతంగా ప్రవహించే నదులు వాగులు వద్ద బ్రిడ్జిలు, కల్వర్టులు పై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ సెంటర్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని సూచించారు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూడ్చేందుకు ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టామని,ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్ లపై అధికారులను ఆరా తీశారు. దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల అంశాల్ని ప్రస్తావించి ఆయా రోడ్ల పరిస్థితి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బి స్టేట్ రోడ్స్ కు సంబంధించి మొత్తం 1214 గుంతలు ఏర్పడి 2488 కి.మీ రోడ్డు పాక్షికంగా దెబ్బతిందని, 2186 కి.మీ రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని,ఇంకా 302 కి.మీ రోడ్డు మరమ్మత్తు ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన రోడ్ల ప్యాచ్ వర్క్ లు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
అట్లాగే వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు,ఆర్వోబి,ఆర్ యుబి ల పనితీరును సైట్ విజిటింగ్ చేసి పరిశీలించాలని సూచించారు. నిరంతర రాకపోకలు ఉండే నదులు,వాగుల మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్ల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి ప్రోగ్రెస్ తో పాటు వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా స్టేట్ రోడ్స్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ ట్రాక్టర్స్ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రోడ్ల పై తిరిగితే రోడ్లు దెబ్బతింటాయి. ఇప్పుడు పంటల సాగు సీజన్ కాబట్టి కేజీ వీల్స్ ట్రాక్టర్స్ రోడ్ల పై తిరుగేటప్పుడు జాగ్రత్తలు పాటించేలా,కేజీ వీల్స్ ట్రాక్టర్ యజమానులకు,రైతులకు అవగాహన కల్పించాలన్నారు. “మంచి రోడ్లు – అభివృద్ధికి చిహ్నాలు” నినాదం తో ముందుకెళ్లాలనీ..జిల్లా కేంద్రం నుండి గ్రామ స్థాయి వరకు పంచాయతీ రాజ్,రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రోడ్లు భవనాలు శాఖపై ప్రత్యేక బాధ్యతలు ఉంచారని, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ గేమ్ చేంజర్ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో త్వరలో ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహిస్తామని,అధికారులు పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.