ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ సచివాలయంలో శనివారం సర్వమత ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన దస్ర్తాలపై తొలి సంతకం చేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధి యూనిట్లకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు రూ.3.55 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఎస్సీ లబ్ధిదారుల సంఖ్య 210 నుంచి 500కి పెంచారు. గిరిజన విద్యా సంస్థల మరమ్మతులకు రూ.79.61 కోట్లు, గిరిజన మినీ గురుకులాల నిర్వహణకు రూ.17.18 కోట్లు, మేడారం జాతర మిగిలిన పనులకు రూ.44.5 కోట్లు మంజూరు చేశారు.
జేఈఈ, నీట్‌లో ప్రతిభ కనబరిచిన 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలి కార్యక్రమంగా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్‌లోని బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో మాట్లాడారు. ఐఐటీ, జేఈఈతో పాటు మెడిసిన్ సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు బహూకరించారు. ఫోన్ మిత్రను మంత్రి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు కేటాయించిన కార్డును స్వైప్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడారు.