- ఏసీబీ దాడులు జరిగిన కార్యాలయాల యంత్రాంగంపై క్రమశిక్షణ చర్యలు!
- లంచం లెక్కిస్తూ సోషల్ మీడియాకు చిక్కిన అశ్వాపురం తహసీల్దార్‌పై వేటు
- కలెక్టరేట్‌కు ‘రాజారావు’ అటాచ్.. అశ్వాపురానికి ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్ డీటీ
- బూర్గంపహాడ్ డిప్యూటీ తహసీల్దార్‌గా కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్
- ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్ డీటీగా బూర్గంపహాడ్ డీటీ రాంనరేశ్‌కు స్థానచలనం
- లంచాలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 24 గంటల్లోపే భద్రాద్రి కలెక్టర్ యాక్షన్
భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సీరియస్‌గా పరిగణించారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు (కంప్యూటర్ ఆపరేటర్) రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కడం, ఏకంగా అశ్వాపురం తహసీల్దారే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు అశ్వాపురం తహసీల్దార్‌పై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు తన కార్యాలయానికే అటాచ్ చేసుకున్నారు.
ఇక అవినీతి అంశంలో చెరిగిపోని మచ్చ తెస్తూ వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్న రెవెన్యూ కార్యాలయాల్లో ఇతర యంత్రాంగంపైనా బదిలీ వేటు వేశారు. ఇక సంచలనంగా మారిన అశ్వాపురం మండల రెవెన్యూ కార్యాలయానికి తహసీల్దార్‌గా భద్రాచలం ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్ డీటీని పంపుతున్నారు. అలాగే, బూర్గంపహాడ్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాంనరేశ్‌ను కూడా భద్రాచలం ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్ డీటీగా బదిలీ చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్‌ను బూర్గంపహాడ్ డీటీగా పంపుతున్నారు. కాగా, లంచాలు, ఏసీబీ దాడులతో బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో రెవెన్యూ కార్యాలయాల ప్రతిష్ట మంటగలుస్తున్న నేపథ్యంలో 24 గంటల్లోపే ఆయా కార్యాలయాల యంత్రాంగంపై భద్రాద్రి కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
అవినీతి, లంచాలకు కేంద్రాలుగా ఉంటున్న అశ్వాపురం, బూర్గంపహాడ్ కార్యాలయాల్లోని యంత్రాంగంపై భద్రాద్రి కలెక్టర్ సీరియర్ అయ్యారు. రేషన్ కార్డు ప్రాసెస్ కోసం ఓ దరఖాస్తుదారుడి నుంచి రూ.2,500 లంచం తీసుకుంటూ బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయ టైపిస్ట్ నవక్రాంత్ శనివారం ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. అలాగే, అశ్వాపురం తహసీల్దార్ రాజారావు కూడా ఓ రైతు వద్ద లంచం తీసుకొని లెక్కిస్తూ సోషల్‌మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. అశ్వాపురం మండలంలో మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఓ రైతు తన పట్టాదారు పాస్‌పుస్తకంలో పేరు మార్పు కోసం దరఖాస్తుతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్‌లైన్ చేయాలంటే రూ.7 వేలు ఇవ్వాలంటూ సదరు రైతును తహసీల్దార్ డిమాండ్ చేశారు.
తన వద్ద రూ.5 వేలే ఉన్నాయంటూ ఆ రైతు చెప్పడంతో ఆ నగదును తీసుకొని లెక్కిస్తూ.. ‘మరో రూ.1000 ఇవ్వాలి’ అంటూ తహసీల్దార్ అడిగిన విషయాన్ని పక్కనే ఉన్న మరో రైతు తన సెల్‌ఫోన్‌లో రికార్డుచేశాడు. ఆ వీడియో రికార్డును సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సదరు తహసీల్దార్ రాజారావును కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ కలెక్టర్ జితేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో మణిధర్ సోమవారం విధుల్లోకి రానున్నారు. అయితే, అటు అశ్వాపురం, ఇటు బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి జలగల విషయం బయటపడిన 24 గంటల్లోనే ఆయా బాధ్యులపై భద్రాద్రి కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు.
అశ్వాపురంలో 3 నెలల క్రితమే ఏసీబీకి చిక్కిన ఏవో..
అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి సాయి శాంతన్‌కుమార్ కూడా మూడు నెలల క్రితమే ఏసీబీకి చిక్కారు. పత్తి కొనుగోలు కోసం ఓ రైతుకు టీఆర్ ఇవ్వడానికి అతడి వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న సదరు ఏవో అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే.(సోర్స్: NT)