రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌ ఏఈ

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్‌పేట సర్కిల్‌-16 వార్డు-2 గోల్నాక డివిజన్‌ నెహ్రూనగర్‌లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా బిల్లు మంజూరు చేయడానికి రూ.15వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేయగా.. బాధితుడు ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌-1 యూనిట్‌ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మనీషా వార్డు కార్యాలయంలోనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అఽధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆమె కాంట్రాక్టర్‌ నుంచి ఇంతకు ముందు రూ.5వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మనీషాపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆమెను కోర్టులో హజరుపర్చి రిమాండ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌-16 పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ విభాగం అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఈ మనీషా ఏసీబీ అధికారులకు పట్టుపడడం చర్చనీయాంశమైంది.