రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సంతోష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. సంతోష్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి లోకాయుక్తగా నియమితులు కావడంతో తాత్కాలిక చైౖర్‌పర్సన్‌గా చిత్రా రామచంద్రన్‌ వ్యవహరించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి చైర్మన్‌గా జస్టిస్‌ సంతోష్‌‌రెడ్డి నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేసుల విచారణ చేపట్టారు. ట్రైబ్యునల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వివాదాలకు సంబంధించి 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

సంతోష్‌‌రెడ్డి 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ వరకు తెలంగాణ రాష్ట్రానికి తొలి న్యాయకార్యదర్శిగా పనిచేశారు. 2018 అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీలో సభ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నవంబరులో మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి లా సెక్రటరీగా నియమితులై 2022 ఫిబ్రవరి 23 వరకు కొనసాగారు. 2022 మార్చి 24న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూన్‌ 20న పదవీ విరమణ చేశారు. ఆయనను రెరా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌కు పూర్తి స్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఈ నెల 16న పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది.