- గత ఏడాది మొత్తంలో 120 కేసులు
- ఈ ఏడాది ఆరు నెలల్లోపే 122 కేసుల నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (ACB) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 120 ట్రాప్ కేసులు నమోదు చేస్తే ఈ ఏడాది ఆరు నెలలు పూర్తికాక ముందే ఈ సంఖ్య 122కు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో సగటున ప్రతి మూడు రోజులకు రెండు కేసుల చొప్పున నమోదవుతున్నా లంచావతారులు ఏమాత్రం జంకకపోవడం గమనార్హం. కొద్ది రోజులుగా అక్రమార్కులు వరుసబెట్టి ఏసీబీకి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఏసీబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం. అందుకే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏసీబీ సత్వర స్పందనతో బాధితుల్లో నమ్మకం, తద్వారా ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. టోల్ ఫ్రీ నంబరు 1064తో పాటు 94404 46106 వాట్సప్ నంబరు, ఫేస్బుక్, ‘ఎక్స్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ప్రజల్లో సాంకేతికత వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఒక కారణం.
సమాచారం రాగానే అధికారులు తొలుత దాన్ని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే తమకు పడని అధికారుల పైనా బాధితుల ముసుగులో పిర్యాదులు చేసే అవకాశం ఉంది. మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోన్, వీడియో రికార్డింగులు వంటివి సమర్పిస్తున్నారు. కొంతమంది లంచావతారులైతే యూపీఐ ద్వారానే ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బాధితులు సమర్పించిన ఇలాంటి ఆధారాలను మరో మారు పునఃపరిశీలించిన తర్వాత అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒక ఫిర్యాదును నిర్ధారించుకొని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి పది రోజులు పట్టేది. ఇప్పుడది మూడు నాలుగు రోజులకు తగ్గింది. ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు ఏసీబీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో మరింత మంది సిబ్బందిని సమకూర్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.