పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేయిస్తాం : బీహార్‌ మంత్రి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company)లో రియాక్టర్‌ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో బీహార్‌ (Bihar) రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు మరణించగా.. మరో 16 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై బీహార్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ సింగ్‌ స్పందించారు. పాశమైలారం పేలుడులో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు మరణించారని, 16 మంది గాయపడ్డారని చెప్పారు. సీఎం నితీశ్‌ సూచన మేరకు తాము ఘటనపై దర్యాప్తు కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. బుధవారం మృతదేహాలను బీహార్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.