యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి : అసదుద్దీన్‌ ఒవైసీ

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.

ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, ఇది బాధాకరమైన ఘటన అని అన్నారు. మృతుల్లో ఎక్కువగా జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. గుర్తించలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి సందర్శించిన తర్వాతనైనా ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ ప్రమాదంలో సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పిదం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. కాగా సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిపేయి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.