రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్‌లో ఉన్న శివం రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రబ్బరు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా నల్లటి పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.
పరిశ్రమలో కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.