పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసమేనా..? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • భద్రతా ప్రమాణాలు గాలికొదిలి.. నామమాత్రపు తనిఖీలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా..?
  • వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు..?
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న

భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైన విధానం కాదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని సందర్శించారు. సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం పటాన్ చెరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం విషాదకరమని, 40 మంది కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. మరి కొంతమంది ఆచూకీ లబించడం లేదని సమాచారం ఉందన్నారు. పరిశ్రమల్లో జరిగే తనిఖీలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. సిగాచీ పరిశ్రమకు ఇంకో రెండుచోట్ల కూడా ఇదే తరహా బ్రాంచీలు ఉన్నాయని, వాటిని కూడా వెంటనే తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలను తనిఖీ చేసే అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమల్లో అధికారులు చేసే తనిఖీలు లంచాల కోసమే జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు. భద్రతా ప్రమాణాలు గాలికొదిలి నామమాత్రపు తనిఖీలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా..? వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలోని ఓ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ వల్ల 11 మంది చనిపోయారని అన్నారు. మృతుల జాబితా వచ్చిన తరువాత ఆయా రాష్ట్రాల వారికి తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన కుటుంబాల సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతానంటే సహకరిస్తామని అన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పట్టభద్రుల ఎంఎల్ సి అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.