సిగాచి కంపెనీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

సిగాచి కంపెనీలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన ఫోర్ మెన్ కమిటీ గురువారంనాడు సంఘటన స్థలాన్ని పరిశీలించింది. నిపుణుల కమిటీ చైర్మన్ సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఎమిరైటస్ సైంటిస్ట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్ రావు, సీఎస్ఐఆర్-ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి. ప్రతాప్ కుమార్, సీఎస్ఐఆర్-సీఎల్ఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, సీఎస్ఐఆర్-ఎన్ సీఎల్ పూనే సేఫ్టి ఆఫీసర్ సంతోష్ గూగెలతో కూడిన బృందం తెలంగాణ ఫ్యాక్టరీల డైరెక్టర్ ఆధ్వర్యంలో పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమకు వచ్చింది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించింది. పరిశ్రమ సేఫ్టీ అధికారులతో, ప్రొడక్షన్ శాఖ అధికారులతో కమిటీ సభ్యులు మాట్లాడారు. పరిశ్రమలో ఎంతమంది కార్మికులున్నారు? పేలుడు ఏ సమయంలో జరిగింది? ఎక్కడ ఎక్కువ నష్టం కల్గింది. సమస్యకు కారణం ఏమిటి, పేలుడు తీవ్రత, దాని ప్రభావం, ఇతర అంశాలపై వారు ఆరా తీశారు. ప్రధానంగా పరిశ్రమలో భద్రతా లోపాలను కనుక్కునే ప్రయత్నం చేశారు. విస్తారమైన అనుభవం ఉన్న నిపుణులు కావడంతో వీరి నివేదిక కీలకంగా మారనున్నది. ఈ కమిటీ మరికొన్నిమార్లు దర్యాప్తునకు వస్తుంది. కాగా మరణించిన వారి వివరాలను సేకరించిన కమిటీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశ్రమలో అన్ని ప్రాంతాల్లో తిరిగి వివరాలను నమోదు చేసుకుంది. అక్కడివారి అభిప్రాయాలను సేకరించింది. అనంతరం కమిటీ మీడియా ఉన్న ద్వారం వైపుగా కాకుండా మరో ద్వారం గుండా వెనుదిరిగింది. కాగా ప్రమాదాల నివారణకు సంబంధించి ఈ కమిటీ కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది. దాంతో పాటు పలు సూచనలు ఇస్తుంది. భవిష్యత్తులో పారిశ్రామికవాడల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను సిఫారసు చేస్తుంది. భారీ ప్రాణనష్టానికి గల కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తారు. సిగాచి భద్రత లోపాలను కూడా గుర్తిస్తారు. పారిశ్రామిక యూనిట్లలో కార్మికుల భద్రతకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (ఎస్ వోపీ) పాటిస్తున్నా రా?లేదా అనేది విచారణలో తేలుస్తారు.