- దత్తు రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి
- దత్తురెడ్డి కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం..
- దత్తు రెడ్డి భార్యకు ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ
కామారెడ్డి జిల్లా పిట్లం: సీనియర్ జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసానిచ్చారు. ఆయన కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన స్వగ్రామం అయిన మద్దెలచెర్వు గ్రామానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దత్తురెడ్డి భార్య, తల్లిని ఓదార్చారు. ఆయన భార్య ప్రియాంకకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. జర్నలిస్టు దత్తు రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.
మంత్రి వెంట ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీ కాంత రావు,సంజీవ్ రెడ్డి, నల్గొండ సీనియర్ జర్నలిస్టులు, తదితరులు ఉన్నారు.