సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గ్రంథాలయశాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలను చెల్లించకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సోమవారం విచారించారు. ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చారు. గతంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా చేసిన రామకృష్ణరావు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసిన ఎన్‌ శ్రీధర్‌, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ శ్రీనివాసాచారి 24న రావాలని ఆదేశించింది.