సిగాచి ఇండస్ట్రీస్‌లో పేలుడు.. 44కు చేరిన మృతులు

 పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్‌ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా దవాఖానలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మంగళవారం ఉదయం మరణించారు. దీంతో మృతుల సంఖ్య 44కు చేరింది. మరోవైపు ధృవ హాస్పిటల్‌లో ఇప్పటివరకు నలుగురు కార్మికులు చనిపోయారు. కాగా, వివిధ దవాఖానల్లో 16 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. మరో 8 మంది కార్మికుల జాడ ఇంకా తేలలేదు.

ఎనిమిది రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ
జస్టిన్‌ ఒక్కసారి కనిపించిపోరా అంటూ అతడి తండ్రి రాందాస్‌ విలపిస్తున్నాడు. కుమారుడి జ్ఞాపకాలతో వారం రోజులుగా ఏడుస్తూనే ఉన్నాడు. మీరిచ్చే నష్టపరిహారం వద్దు.. నా జస్టిన్‌ను నాకివ్వండి అంటూ అధికారులను కోరుతున్నాడు. అతడి ఆవేదనను అర్థం చేసుకున్న అధికారులు ఓదార్చి పంపిస్తున్నారు తప్పా జస్టిన్‌ను మాత్రం వెతికి తేలేకపోతున్నారు. డ్యూటీ దొరికింది నాన్న అంటూ బండ్లగూడ నుంచి సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచికి వచ్చిన జస్టిన్‌ కేవలం రెండు రోజులు మాత్రమే విధులకు హాజరయ్యాడు. శనివారం డ్యూటీ చేశాడు, ఆదివారం సెలవు, సోమవారం విధులకు వచ్చి సిగాచిలో జరిగిన పేలుడులో గల్లంతయ్యాడు. అందరితో కలగొలుపుగా ఉంటూ ప్రేమాభిమానాలు చాటే జస్టిన్‌ కనిపించకపోవడంతో అతడి బంధువులతో పాటు మిత్రులు కూడా 50-60 మంది హెల్ప్‌డెస్క్‌ వద్ద పడిగాపులు పడుతున్నారు.