- తెలంగాణ రాష్ట్రం నగర రాజ్యం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది
- ఆధునికత, అభ్యుదయానికి తెలంగాణ రాష్ట్రం కేంద్రం
- సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలు
తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉంది, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ లోని ఓ ప్రైవేటు హోటల్లో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (cii) ఆధ్వర్యంలో నిర్వహించిన CFO ల (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్) సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు ఫలితాలను మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఫార్మా, ఐటీ కంపెనీలతోపాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. లండన్ లోనీ THEMS నది మాదిరిగా హైదరాబాద్ నగరంలో మూసి నదిని పారించేందుకు మూసి పునర్జీవనం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.
పెట్టుబడులకు హైదరాబాద్ పట్టణం, తెలంగాణ రాష్ట్రం స్వర్గ ధామం లాంటిదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తారు, చక్కటి వాతావరణం, కాలుష్య రహితం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 100 ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉన్నాయి త్వరలో ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకం రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, సంపద సృష్టికి పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుంది, కలిసి సాగుదాం రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చూడదామని డిప్యూటీ సీఎం తెలిపారు. పారిశ్రామికవేత్తలు CSR నిధులను పాఠశాలలు, నాలెడ్జ్ సెంటర్ల కోసమే కాకుండా రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మారుతున్న ప్రపంచంలో ఫైనాన్స్ రంగం కేవలం లెక్కల పరిరక్షణకే పరిమితం కాలేదు, CFO లు ఇప్పుడు సంస్థల దశను నిర్దేశించే మార్గదర్శకులు అని ఇప్పుడు సీఎం తెలిపారు. CFO లు వ్యూహకర్తలుగా, సాంకేతిక నిపుణులుగా ప్రమాదాల నిర్వహణలో శిల్పులుగా మారాలని డిప్యూటీ సీఎం సూచించారు.
సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, అనలి టిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ గొప్పల కోసం చెప్పుకునే మాటలు కాదు నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఇవి మార్చి వేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఎన్నో రంగాల్లో సామర్థ్యం పెరిగిన దాఖలాలు మనకు ఉన్నాయి అన్నారు. లైఫ్ సైన్స్ నుంచి మొదలు పెడితే లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి పరిపాలన వరకు సామర్థ్యం పెరిగిందని తెలిపారు.
CFO లు ఆర్థిక నాయకులుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓడిసిపట్టాలి, కేవలం ఆపరేషన్ సామర్థ్యం కోసం కాకుండా బలమైన వ్యూహాత్మక నిర్ణయాల కోసం టెక్నాలజీ పై పట్టు సాధించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా ఆశయాలకు అనువైన వాతావరణం ఉన్నది, ప్రగతిశీల విధానాలు, మంచి మౌలిక సదుపాయాలు, నవ ఆవిష్కరణల పట్ల స్ఫూర్తి, లైఫ్ సైన్సెస్, గ్రీన్ పవర్, పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయ గమ్యంగా మార్చాయని తెలిపారు. అయితే అభివృద్ధిని కేవలం ఆర్థిక ఉత్పత్తిలోనే కొలవలేము, దాని ప్రయోజనాలు ఎంత మేరకు అందరికీ చేరుతున్నాయో కూడా చూడాలి అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు ప్రజా ప్రభుత్వ పాలనలో కేంద్ర బిందువులు అని తెలిపారు. ఈ దృష్టితోనే రాష్ట్రంలో ఎన్నో కీలక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 100 పాఠశాలలు నిర్మించేందుకు కార్యాచరణ ప్రారంభించామని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరుద్యోగ యువతలో ప్రతిభను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించాలని నిర్ణయించి మొదటి సంవత్సరంలో 21,500 కోట్లు వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. మన ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రాష్ట్ర ప్రజల బలం పెరగాలి, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి రెండు జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టాలన్నదే ఈ పథకాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం వివరించారు.
ప్రజా ప్రభుత్వం లో పారిశ్రామిక రంగం భాగస్వామిగా ఉండాలని, రాష్ట్ర ప్రజల విజయ గాధల్లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. CII సదస్సు ద్వారా జరిపే చర్చలు భవిష్యత్తు కార్యాచరణలో వెలుగులు చూపుతాయన్న విశ్వాసం తనకు ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేస్తే మార్కెట్ అనిశ్ఛితి మనకు అడ్డు కూడా కాదు ఆ అనిచ్చితే కొత్త ఆవిష్కరణలకు, సుస్థిర ఆర్థిక వ్యవస్థకు, పంచుకోదగిన అభివృద్ధికి మార్గం చూపుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కార్యక్రమంలో CII నిర్వాహకులు శేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఎంవి నరసింహం, గౌతమ్ రెడ్డి, సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.