- మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీలో హ్యామ్ రోడ్లు కీలకం
- అర్బన్,సెమీ అర్బన్, రూరల్ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
- NHAI నార్మ్స్ ప్రకారం పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం
- ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయాలి
- హ్యామ్ మోడల్ తో రాష్ట్ర వ్యాప్తంగా 50% రోడ్లు కవర్ అవుతాయి
- రోడ్లు భవనాలు శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆర్ అండ్ బి శాఖ అధికారులు,NHAI అధికారులతో డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో సుదీర్ఘంగా 5గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీలో హ్యామ్ రోడ్లు కీలకం కానున్నాయని తెలిపారు. అర్బన్,సెమీ అర్బన్, రూరల్ ఏరియాలుగా రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల ప్యాకేజీల ఆమోదంతో తర్వాత టెండర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో రోడ్ ప్యాకేజీల వివరాలు చర్చించారు. NHAI నార్మ్స్ ప్రకారం పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తూ హ్యామ్ రోడ్ల నిర్మాణం చేస్తామని,పదేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా క్వాలిటీ పాటించేలా వర్క్ ఏజెన్సీలకు ముందుగానే తెలియజెప్పాలని ఆర్ అండ్ బి అధికారులతో అన్నారు. ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయడమే కాకుండా లో లెవెల్ బ్రిడ్జి,హై లెవల్ బ్రిడ్జ్ లాంటివి ముందే ఐడెంటిఫై చేసి భవిష్యత్ లో ప్రమాదాలు జరగకుండా..రవాణాకు అసౌకర్యం లేకుండా కన్సల్టెంట్ టీం లతో సంప్రదించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బి పరిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50% రోడ్లు కవర్ అవుతాయనీ,దీన్ని సిరియస్ గా తీసుకొని అధికారులు రేయింబవళ్ళు కష్టపడాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రారంభంతో పాటు సదరన్ పార్ట్ ఆమోదం కోసం సిఎం తో కలిసి ప్రధాని మోదీ,కేంద్రమంత్రి గడ్కరీని త్వరలో కలుస్తామని చెప్పారు. NH 65 రోడ్డు పనుల పురోగతి పై అధికారులను ఆరా తీసిన మంత్రి మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు 6లేన్ల రహాదారి విస్తరణ పనుల పురోగతిపై చర్చించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. టిమ్స్ హాస్పిటల్స్,వరంగల్ హాస్పిటల్,మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, పలు ఆర్వోబి లు నిర్మాణ చివరి దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,NHAI రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్,NH అధికారులు, ఆర్ అండ్ బి ఈఎన్సి జయ భారతి,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,మోహన్ నాయక్,ఎస్.ఈ ధర్మారెడ్డి,పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.