కల్లు తాగి అస్వస్తులై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల కూకట్ పల్లి పరిధిలో కల్లు తాగడం వల్ల ఏర్పడిన పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలపై సంబంధిత ఉన్నతాధికారులతో సి.ఎస్. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, వైద్య , ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ షా నవాజ్ కాసీం, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మొహంతి, ఎక్సయిజ్ శాఖ కమీషనర్ రవికిరణ్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. రామకృష్ణా రావు మాట్లాడుతూ, గత రాత్రినుండి నిమ్స్, గాంధీ తోపాటు పలు ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలూ అందించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ఈసంఘటనకు భాద్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంఘటనపై సవివర నివేదిక అందచేయాలని ఎక్సయిజ్ అధికారులను ఆదేశించారు. మరణించిన వారు ఏకారణం చేత మరణించారని, పోస్ట్ మార్టం నివేదిక లో వచ్చిన అంశాలు, బాధ్యులపై చేపట్టిన చర్యలపై సవివరమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నిమ్స్ లో 31 మంది చికిత్స పొందుతున్నారని, మరో 6 గురు వివిధ ఆసుపత్రుల్లో చేరారని ఎక్సయిజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి తెలిపారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతుందని సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మొహంతి తెలిపారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది చికిత్స పొందు తున్నారని, వీరిలో కేవలం 4 గురు మినహా మిగిలిన వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. విరోచనాలు, డీహైడ్రేషన్ తదితర కారణాల వల్ల నిమ్స్ లో జాయిన్ అయ్యారని వివరించారు. ఈ సంఘటనపై 5 కేసులు నమోదు చేసి, ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నామని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ షానవాజ్ వెల్లడించారు.
