తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌

తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న బీసీల రాజకీయ శకం ఆరంభమైందని.. రాబోయేది బీసీ రాజ్యమేనని, దాన్ని ఇక ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం భద్రాచలంలో జరిగిన బీసీల సమర శంఖారావం సభకు హాజరైన ఆయన మాట్లాడారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని, 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన చోట 18 మంది కూడా లేకపోవడం, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటా దక్కేంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీల రిజర్వేషన్‌కు ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. బీసీలకు తాను అండగా ఉంటానని, రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తానన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.