రిటైర్డ్ ఈఎన్సీ(ENC) ముర‌ళీధ‌ర్ రావు అవి”నీటి” తిమింగలం

  • చంచ‌ల్‌గూడ జైలుకు రిటైర్డ్ ఈఎన్సీ(ENC) ముర‌ళీధ‌ర్ రావు త‌ర‌లింపు
  • మార్కెట్‌ విలువ రూ.500 కోట్లపైనే
  • హైదరాబాద్‌లోని మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం
  • నగరం శివార్లలో 11 ఎకరాల సాగు భూమి
  • జహీరాబాద్‌లో 2 కేవీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు
  • బంజారాహిల్స్‌, యూసు్‌ఫగూడ, కోకాపేట, బేగంపేటల్లో
  • నాలుగు ఫ్లాట్లు, ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇళ్ల స్థలాలు
  • కోదాడ, వరంగల్‌లో అపార్టుమెంట్లు, కొండాపూర్‌లో విల్లా
  • కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మురళీధర్‌, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
  • ఉదయం అదుపులోకి.. సోదాలు.. సాయంత్రానికి అరెస్టు
  • ఆయన ఆస్తులన్నీ అక్రమార్జనగా గుర్తించాం
  • బంగారం, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది: ఏసీబీ డీజీ

 హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం! అంటే.. దాదాపు ఎకరంన్నర! హైదరాబాద్‌ శివార్లలో 11 ఎకరాల పొలం! హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు! అపార్టుమెంట్లు! ఫైవ్‌స్టార్‌ లగ్జరీ విల్లాలు! సెలబ్రిటీ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు! ఇవన్నీ కాకుండా ఓ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కూడా! కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన విశ్రాంత ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) సి.మురళీధర్‌ రావు ఆస్తుల్లో ఇవి కొన్ని మాత్రమే! ఆయన ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.500 కోట్లను దాటిపోవచ్చని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులే అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మురళీధర్‌రావు ఈఎన్సీ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. తన పదవీ కాలాన్ని పెంచుకుంటూ కేసీఆర్‌ సర్కారులో పదేళ్లూ ఆయన కొనసాగారు. ఈఎన్సీ జనరల్‌గా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా పని చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు కొనసాగారు. పదవీ విరమణ తర్వాత మొత్తంమీద 13 ఏళ్లపాటు ఆయన నీటి పారుదల శాఖలోనే పనిచే శారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు రావడంతో మంగళవారం ఉదయం ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుంది. జూబ్లీహిల్స్‌, మోకిల, కరీంనగర్‌, జహీరాబాద్‌, వరంగల్‌, కోదాడ సహా మొత్తం 11 ప్రాంతాల్లో మురళీధర్‌ రావు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది.

కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్‌, యూసు్‌ఫగూడ, కోకాపేట, బేగంపేటల్లో నాలుగు ఫ్లాట్లు, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌, కరీంనగర్‌ల్లో రెండు వాణిజ్య సముదాయాలు; కోదాడలో అపార్ట్‌మెంట్‌, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌, మోకిలలో 6,500 గజాల స్థలం, హైదరాబాద్‌ చుట్టుపక్కల 11 ఎకరాల పొలం; జహీరాబాద్‌లో 2 కేవీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు (ఎన్‌రిచ్‌), మెర్సిడెస్‌ బెంజ్‌ సహా మూడు కార్లు ఆయనకు ఉన్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. కరీంనగర్‌లో మురళీధర్‌రావు సోదరుడు డాక్టర్‌ రామ్మోహన్‌ రావు, సమీప బంధువు రవీందర్‌ రావు ఇళ్లలో సోదాలు జరిపారు. రవీందర్‌ రావు విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. ఆయన ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. మురళీధర్‌రావు వద్ద లభ్యమైన ఒక డాక్యుమెంట్‌కు సంబంధించి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌కు చెందిన హనుమకొండ న్యూ శాయంపేటలోని సహస్ర ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సోదాలు చేశారు. కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, బంగారం, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ డీజీ విజయకుమార్‌ తెలిపారు. ఈ ఆస్తులన్నీ అక్రమార్జనతోనే మురళీధర్‌రావు కొనుగోలు చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఆయన తెలిపారు. దాంతో, మంగళవారం సాయంత్రానికి ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. త్వరలో కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తామని డీజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన నీటిపారుదల శాఖ అధికారులు హరిరాం, నూనె శ్రీధర్‌ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఇళ్లల్లోనూ వందల కోట్లలోనే ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించడం గమనార్హం.

చంచ‌ల్‌గూడ జైలుకు రిటైర్డ్ ఈఎన్సీ(ENC) ముర‌ళీధ‌ర్ రావు త‌ర‌లింపు
అక్రమ ఆస్తుల కేసులో ఇరిగేషన్‌ శాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏసీబీ నిన్న రాత్రి అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ముర‌ళీధ‌ర్ రావును ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా, ఆయ‌న‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంత‌రం ఆయ‌న‌ను పోలీసులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.

ఈ కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతో పాటు 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ విల్లాతోపాటు బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేటలో ఫ్లాట్లు.. కరీంనగర్‌, హైదరాబాద్‌లో కమర్షియల్‌ బిల్డింగులు, వరంగల్‌, కోదాడలో అపార్ట్‌మెంట్లు, జహీరాబాద్‌లో 2 కిలోవాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 4 ఓపెన్‌ రెసిడెన్షియల్‌ ప్లాట్లు, మోకిలాలో 6,500 చదరపు గజాల భూమి, ఓ బెంజ్‌ కారు సహా 3 ఫోర్‌వీలర్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు తేల్చారు. మురళీధర్‌రావు తన పదవిని ఉపయోగించుకొని ఈ ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ పేరొన్నది.