కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా ఆయన అభివర్ణించారు.
బుధవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణా, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏ.రేవంత్ రెడ్డి,చంద్రబాబు నాయుడు లతో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాశయాల వినియోగంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి ఎప్పటి నుండో వివాదాస్పదంగా మారాయని,అటువంటి వివాదాస్పద అంశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో టెలిమెట్రి పరికరాలు అమర్చాలన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను గట్టి పట్టుపట్టి సాధించామన్నారు.
ఇప్పటికే కొంత మేర పరికరాలు అమర్చినప్పటికి మొత్తం నీటి వినియోగంలో టెలిమెట్రి పద్ధతిని అమలు పరచేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కు నిధులు మంజూరు చేసేందుకు కూడా తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అంశాన్ని ప్రస్తావించి ఈ విధానం అమలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ఆయన వివరించారు.
అదే విదంగా శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ని వివరించడంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కుడా డ్యామ్ పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. అందుకు స్పందించిన కేంద్రం శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు తక్షణం పూను కోవాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశించిందని ఆయన తెలిపారు. అంతే గాకుండా నదీ యాజమాన్యాల్ బోర్డుల విషయమై 2020 లో జరిగిన ఏపేక్స్ సమావేశంతో పాటు ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించామన్నారు.
అందుకు స్పందించిన కేంద్రం కృష్ణా,గోదావరి నదీ యాజమాన్యాల బోర్డులలో ఒకటి తెలంగాణాకు మరొకటి ఆంద్రప్రదేశ్ కు ఉండే విదంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణకు,కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంద్రప్రదేశ్ లో ఉండేలా నిర్ణయం తీసుకుందన్నారు. కృష్ణా-గోదావరి నదులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా ఇరు రాష్ట్రాలకు చెందిన నిపుణుల కమిటీని వారం రోజుల్లో వేసి టైమ్ బౌండ్ ప్రోగ్రాంతో నెల రోజుల వ్యవధిలో వచ్చే నివేదికననుసరించి నిర్ణయం తీసుకుంటామన్నారు.