అందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాలు కేవలం ఒక ఉత్సవం కాదు… మన తెలంగాణ జీవన విధానం, తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. మన సమష్టి సంకల్పానికి, పౌరుషానికి, ఐక్యతకు, ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, మన ఘనమైన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. బోనాలు… ఈ పదం కేవలం ఒక పండగను కాదు, మన తెలంగాణ మట్టి వాసనను, అమ్మ ప్రేమను, మన ఆత్మశక్తిని గుర్తు చేస్తుంది. గడపగడపనా వెల్లివిరిసే ఈ సంబురం, డప్పుల మోతలో ప్రతిధ్వనించే మన చరిత్ర, బోనాల్లో కనిపించే భక్తి, ఇవన్నీ మన తెలంగాణ జీవన విధానానికి ప్రాణం.
సకల సృష్టికి మూలం, సమస్త లోకాలను కాపాడే శక్తి అమ్మవారు. ఆమె చల్లని దీవెనలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నా. ఆమె చల్లని దయతో తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నా. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు… ఇవి కేవలం మన రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికి మన తెలంగాణ జీవన విధానం, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజల స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు. జంట నగరాల్లో రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు కేటాయించాం. నగరంలోని 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో ఈ నిధులను అందజేశాం. ఇది కేవలం ఒక ప్రకటన కాదు.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేసే దృఢ సంకల్పం.
ఈరోజు హరిబౌలిలోని చారిత్రక శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు లభించిన గొప్ప అదృష్టం. విశేష గౌరవం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మన హైదరాబాద్ చరిత్రకు, ఆధ్యాత్మికతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఇక్కడి అమ్మవారిని దర్శించుకొని, ఆశీస్సులు పొందడం నిజంగా ఒక మధురానుభూతి. తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు, సంప్రదాయ పరిరక్షణకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి ఆశీస్సులతోనే ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో… ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం.