సాధించిన ప్ర‌గ‌తికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • ఏడాదిన్న‌ర‌లో కొండంత చేశాం- గోరంత కూడా చెప్పుకోలేక‌పోతున్నాం
  • అప్పుడు, ఇప్పుడు ఆ పార్టీది గోబెల్ ప్ర‌చారమే
  • జిల్లా పౌర‌సంబంధాల అధికారులతో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో.. రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ ఏడాదిన్న‌ర కాలంలో ఎన్నోసంక్షేమ ప‌ధ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న‌ప్ప‌టికీ చేసిన మంచి ప‌నుల‌ను స‌వివ‌రంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. నేడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ప‌దేళ్లు అధికారంలో ఉన్న స‌మ‌యంలో చెయ్య‌నివాటిని చేసిన‌ట్లుగా గోబెల్ ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టింద‌ని, ప్ర‌తిప‌క్షంలో కూడా అదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతోంద‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం చేసిన‌దాన్ని కూడా పూర్తిగా చెప్పుకోలేక‌పోతున్నామ‌ని అన్నారు. డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలో ఐ & పిఆర్ స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక‌, ముఖ్య‌మంత్రి ప్ర‌జాసంబంధాల అధికారి

జి. మ‌ల్సూర్‌తో క‌లిసిమంగ‌ళ‌వారం జిల్లా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఏడాదిన్న‌ర‌లో ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల‌కు ఎంతోచేసినప్ప‌టికీ ఆశించిన రీతిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. ఇచ్చిన హామీల‌నే గాక ఇత‌ర అంశాల‌లో ప్ర‌జోప‌యోగ‌ప‌నులు చేప‌ట్టామ‌ని , 60 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామ‌కాలు చేప‌ట్టిన రాష్ట్రంగా తెలంగాణ‌ను అగ్ర‌ప‌ధంలో నిలిపామ‌న్నారు. ఇవేగాక మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం, పేద‌ల‌కు స‌న్న‌బియ్యం, మ‌హిళ‌ల‌కు రూ. 500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌, రైతుభరోసా పెంపు, రుణ‌మాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు,ఇందిరమ్మ ఇండ్లు, రేష‌న్‌కార్డుల పంపిణీ ఇలా రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల సంక్షేమానికి ఎంతో చేశామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో చేయ‌లేనిది ఏడాదిన్న‌ర‌లో చేసి చూపించాం. ప‌ది సంవ‌త్స‌రాల‌లో పేద‌ల‌కు రేష‌న్ కార్డులు ఇందిర‌మ్మ ఇండ్లు ఆలోచ‌న కూడా చేయ‌లేదు. ఉన్న రేష‌న్ కార్డుల‌లో పేర్లు కూడా న‌మోదు చేయ‌లేదు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా రేష‌న్ కార్డుల్లో పేరున‌మోదు కోసం ఎదురు చూస్తున్న 15 లక్ష‌ల మంది పేద‌ల పేర్ల‌ను రేష‌న్ కార్డుల‌లో న‌మోదు చేశాం. కొత్త‌గా 7 ల‌క్ష‌ల రేష‌న్ కార్డులిచ్చాం. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చాం. ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది ఉన్నాకూడా పేద‌ల సంక్షేమం విష‌యంలో ఈ ప్ర‌భుత్వం రాజీ ప‌డ‌డం లేదన్నారు. ఈ ప్ర‌భుత్వం తీసుకున్న అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను విరివిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త జిల్లాస్ధాయిలో పౌర‌సంబంధాల శాఖ అధికారుల‌దేన‌ని ఈ బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు సూచించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ జగన్ డిప్యూటీ డైరెక్టర్ మధు పాల్గొన్నారు