ఉమ్మడి జిల్లాలకు స్పెషలాఫీసర్లు

ఉమ్మడి పది జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను (స్పెషలాఫీసర్లను) నియమించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఐఏఎస్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం జీవో-999ను జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్పెషలాఫీసర్‌గా సీ హరికిరణ్‌, కరీంనగర్‌ జిల్లాకు సర్ఫరాజ్‌ అహ్మద్‌, నిజామాబాద్‌కు రాజీవ్‌గాంధీ హన్మంతు, ఉమ్మడి రంగారెడ్డికి డీ దివ్యను స్పెషలాఫీసర్లుగా నియమించింది. నల్లగొండకు అనితారామచంద్రన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాకు రవి, వరంగల్‌ జిల్లాకు శశాంక, మెదక్‌కు ఏ శరత్‌, ఖమ్మం జిల్లాకు సురేంద్రమోహన్‌, హైదరాబాద్‌ జిల్లా ప్రత్యేకాధికారిగా ఇలంబర్తికి బాధ్యతలప్పగించింది. స్పెషలాఫీసర్లుగా నియమితులైనవారు ఆయా జిల్లాల్లో గతంలో పనిచేసిన వారే కావడం విశేషం. అయితే ఈ నెలలో రిటైర్డ్‌కానున్న ఐఏఎస్‌ శరత్‌ ను స్పెషలాఫీసర్‌గా నియమించింది. అంటే మరో వారం రోజుల్లో ఆయన రిటైర్డ్‌కానున్నారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన స్థానంలో మరో ఐఏఎస్‌ అధికారి అలుగు వర్షిణికి బాధ్యతలప్పగిస్తూ 23న జీవో కూడా విడుదల చేసింది. కానీ స్పెషలాఫీసర్ల జాబితాలో ఆయన పేరుండటం గమనార్హం.