అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

  • వ‌చ్చేనెల‌ 15లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి
  • ఇందిర‌మ్మ ఇండ్ల స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల ప‌రిష్కారానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్‌
  • వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు
  • రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వ‌చ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాల‌ని, ఇందుకు అర్హులైన ల‌బ్దిదారుల ఎంపిక‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.
అంపూర్తిగా ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే ల‌బ్దిదారుల‌కు 5 ల‌క్ష‌ల రూపాయిలు ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు ద‌ర‌ఖాస్తు ఎప్పుడు చేసుకున్నార‌నేది ముఖ్యం కాద‌ని నిరుపేద‌ల‌కు ఇండ్లు ఇవ్వడ‌మే ప్ర‌ధాన‌మ‌న్నారు. ఇప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాకూడా వాటిని ప‌రిశీలించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఇసుక, చెల్లింపులు, ల‌బ్దిదారుల ఎంపిక‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. శ్రావ‌ణ మాసం మొద‌లైన నేప‌ధ్యంలో త్వ‌ర‌లోనే ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్ర‌వేశాలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హైద‌రాబాద్‌లోని హౌసింగ్ కార్యాల‌యంలో త్వ‌ర‌లో ఒక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెల‌పారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి సూచ‌న‌ల ప్ర‌కారం శాస‌న‌స‌భ్యుల‌ను భాగ‌స్వామ్యం చేసి ప్ర‌తి మండ‌లంలో రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం నాడు వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ‌ మంత్రి శ్రీ‌మ‌తి సీత‌క్క‌, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో కలిసి వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, భద్రకాళి దేవస్థానం, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔట‌ర్‌రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై స‌మీక్షించారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్ని సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నామ‌ని గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ అభివృద్దికి చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలకు సంబంధించిన డి.పి.ఆర్‌. టెండ‌ర్‌, ప‌నులు ప్రారంభించ‌డానికి, పూర్తి చేయ‌డానికి ఒక‌ ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకొని ప‌నిచేయాల‌ని సూచించారు. వ‌రంగ‌ల్ ప్రాంత చిర‌కాల స్వ‌ప్న‌మైన మామునూరు ఎయిర్ పోర్ట్ క‌ల త్వ‌ర‌లో సాకారం కానుంద‌ని అయితే ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ యుద్ధ ప్రాతిప‌దికన చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌కు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవ‌ని రెండు రోజుల క్రితం 205 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఈ భూ సేక‌ర‌ణ‌కు గ్రీన్ ఛాన‌ల్ ద్వారా నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు. కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి అక్క‌డ రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది ల‌బ్దిదారుల‌ను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని తెల‌పారు. ఈ కాల‌నీకి సంబంధించి సెప్టెంబ‌ర్ నెలాఖరు నాటికి మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న పూర్తికావాల‌ని ఆదేశించారు. అలాగే వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌, ప్రాధ‌మిక పాఠ‌శాల‌, గ్రామ పంచాయితీ కార్యాలయ భ‌వ‌నం నిర్మించాల‌ని, మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువ‌తకు ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. రూ. 4170 కోట్ల‌తో 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించ‌డానికి వీలుగా పనుల‌ను విభ‌జించుకొని ద‌శ‌ల వారీగా చేప‌ట్టాల‌ని సూచించారు.

భ‌ద్ర‌కాళి ఆల‌య మాడవీధుల‌తోపాటు క‌ల్యాణ మండ‌పం, పూజారి నివాసం , విద్యుత్ అలంక‌ర‌ణ‌లను వ‌చ్చే ద‌స‌రా నాటికి అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకొని ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు తానే స్వ‌యంగా వ‌స్తాన‌ని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జి తో స‌హా అన్ని ప‌నులు వ‌చ్చే డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తిచేయాల‌న్నారు. భ‌ద్ర‌కాళి చెరువు ప్రాంతంలో ఇంత‌వ‌ర‌కు 3.5 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని త‌ర‌లించామ‌ని, 2.06 కోట్ల రూపాయిల మ‌ట్టిని విక్ర‌యించామ‌ని అధికారులు తెలిపారు. ఈ వ‌ర్షాకాలం పూర్త‌యిన వెంట‌నే ఈ చెరువు మ‌ట్టిని త‌ర‌లించాల‌ని మంత్రి గారు సూచించారు. ఆల‌యంలో యంత్రాల సాయంతో భోజ‌న త‌యారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని దీనికి త‌గ్గ‌ట్టుగా నిర్మాణాలు చేయాల‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా వ‌రంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన భూమిని గుర్తించాల‌ని సూచించారు. హాస్ట‌ల్ లో విధ్యార్ధుల‌కు, హాస్పిట‌ల్ లో ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందేలా చూడ‌డానికి మండ‌లానికి సంబంధించిన ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ స‌భ్యులు బ‌ల‌రాం నాయిక్‌, శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.నాగరాజు, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, నాయ‌ని రాజేంద‌ర్‌, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, అంజిరెడ్డి, బండ ప్ర‌కాష్‌, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన రాష్ట్ర స్ధాయి ఉన్న‌తాధికారులు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు