ఖరీఫ్ కు పుష్కలంగా విద్యుత్ – ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఐఏఎస్

  • ఈ జులై నెలలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న డిమాండ్
  • గతేడాది తో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్ డిమాండ్
  • నిరంతర విద్యుత్ సరఫరా కు అప్రమత్తం గా వుండండి.
  • వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ అధికారులను ఆదేశించిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఐఏఎస్.

గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షా కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ అధికారులతో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ గారితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నవీన్ మిట్టల్ ఐఏఎస్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి మరియు ఉప ముఖ్య మంత్రి విద్యుత్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ గావిస్తున్నారని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరం లో పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో పాటు గృహ రంగంలో కూడా భారీ వినియోగం నమోదవుతుంది. దీనికి తోడు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండటంతో లక్షలాది మోటర్లు నిరంతరం నడుస్తున్నాయి. ఫలితంగా వర్షాల సీజన్ లో కూడా భారీగా డిమాండ్ నమోదవుతున్నది. గతేడాది (2024) జులై 31 న 13541 మెగావాట్లుగా నమోదయిన గరిష్ట డిమాండ్ ఈ ఏడాది జులై 16న 14.05 శాతం పెరుగుదలతో 15443 మెగావాట్లుగా నమోదయ్యిందన్నారు.

పుష్కలంగా వర్షాలు పడుతుండటంతో నీటి లభ్యత బాగా పెరిగింది. వరి నాట్లు జోరందుకోవడంతో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎండీ స్థాయి నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా వుంటూ ఎలాంటి అవాంతరాలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ వర్షాల సీజన్ లో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వుంటూ, వర్షాలు కురిసేటప్పుడు తప్పనిసరిగా తమ కార్యాలయాల్లో అందుబాటులో వుంటూ సరఫరా పర్యవేక్షించాలని నవీన్ మిట్టల్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో TGSPDCL డైరెక్టర్లు డా. నర్సింహులు, చక్రపాణి, శ్రీ కృష్ణా రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.