అవినీతి నిర్మూలనే సమాచార హక్కు చట్టం లక్ష్యం

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్ రావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, మోహిసిన్ పర్వీన్, మెర్ల వైష్ణవి మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు సమావేశాలను నిర్వహించారు. ప్రజలకు పారదర్శకత‌ జవాబుదారీతనంతో కూడిన చట్టంలో నిబంధనలకు లోబడి ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలి. పౌర సమాచార అధికారుల అవగాహన సదస్సులో రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచన చేశారు.

మంగళవారం మెదక్ జిల్లా సమాచార హక్కు చట్టం కమిషనర్లు పర్యటన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులతో ఆర్టిఐ యాక్ట్ అమలు చేయు విధి విధానాలపై క్షుణ్ణంగా పౌర సమాచార అధికారులకు చట్ట నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లాకు ‌ చేరుకున్న రాష్ట్ర ముఖ్య పౌర సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతర కమిషనర్లు, పీవీ శ్రీనివాస్ , బోరెడ్డి ,అయోధ్య రెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్ రాష్ట్ర ముఖ్య పౌర సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పూల బొకేతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ గౌరవ వందన స్వీకరించి, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తదుపరి ప్రజావాణి హాలులో పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సుకు ఇతర కమిషనర్లతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టి మొదటిగా మెదక్ జిల్లాకు రావడం జరిగిందని సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ శాఖల అధికారులు చూపించిన చొరవ హర్షించదగ్గ విషయం అన్నారు మెదక్ జిల్లాలో ఆర్టిఐ యాక్ట్ సమర్థవంతంగా అమలవుతుందన్నారు.

సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. సెక్షన్లు, సబ్ సెక్షన్లపై క్షుణ్ణంగా చదివి పౌర సమాచార అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాల్సిన ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న29 ప్రభుత్వ శాఖలలో 15 శాఖలలో ఏం కేసులు లేకపోవడం హర్షించ దగ్గ విషయంగా పేర్కొన్నారు.

136 దేశాలలో RTI ACT అమలులో ఉందన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారుతనం ఎంత అవసరమో పారదర్శకత అంతే అవసరమని ఆర్టి.ఐ యాక్ట్ ద్వారా పూర్తి సమాచారం అందించినప్పుడు మాత్రమే జవాబుదారితనం పారదర్శకత సార్ధకత స్థాయికి వెళ్తాయని చెప్పారు. గత పది సంవత్సరాల కాలంలో సమాచార కమిషన్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయ ని తెలిపారు ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్ షాట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.సహేతుక కారణాలు చూపించకుండా ఆర్టిఐ ఆక్ట్ దరఖాస్తులను తిరస్కరించకూడదని చెప్పారు.సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉంది కాబట్టి అందరూ బాధ్యతగా తీసుకొని వీలైనంత తొందరగా సమాచారం ప్రజలకు అందించాలన్నారు. రాబోవు ఆగస్టు నెలలో పెండింగ్లో ఉన్న కేసులను పూర్తిగా పరిష్కరించి కొత్త దరఖాస్తులు ద్వారా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పారు.

రెండు నెలల్లో 30 శాఖల కేసులకు పూర్తిగా పరిష్కరించి జీరో కేసులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 11 జిల్లాలను ఎంపిక చేసుకుని సమాచార హక్కు చట్టం ద్వారా పౌర సమాచార అధికారులకు అవగాహన పెంపొందించి చట్టంలోని సెక్షన్లు, పూర్తిగా వివరిస్తున్నామన్నారు ద్వారా కేసులను పూర్తిగా పరిష్కరించవచ్చన్నారు. అందరికీ సమాచారం అందించేందుకు ముందుకు రావాలన్నారు 22 జిల్లాల్లో 17 శాఖలు వచ్చే మార్చి లోపు అన్ని కేసులకు పరిష్కార మార్గాలు చూపి సమాచారం అందించే విధంగా చూస్తామన్నారు. మరుగున పడిన వ్యవస్థను నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకువచ్చి ప్రజలకు జవాబు దారి తనం పెంచడంలో అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ
శాఖల పూర్తి నిబంధనలను అనుసరిస్తూ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు నిబంధనలకు లోబడి సమాచారం అందించే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. అంతకుముందు మిగతా పౌర సమాచార కమిషనర్లు సమాచార హక్కు చట్టంపై నియమ నిబంధనలను పౌర సమాచార అధికారులకు సుదీర్ఘంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూఫ్రాన్ జయచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల పౌర సమాచార అధికారులు, పోలీస్ యంత్రాంగం, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.