తెలంగాణలో భారీ పన్ను మోసం వెలుగులోకి – వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలలో హైదరాబాద్ లోని ఒక ప్రధానమైన ప్రైవేట్ సంస్థ అయిన కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ యొక్క పన్ను మోసాన్ని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు సంస్థ యొక్క ఎస్‌పి రోడ్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లపై సమన్వయంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ సంస్థ అసలు సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అనుమానం ఉంది. ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించగా, డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.

ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. వాహనాల హల్చల్ లేని పరిస్థితిలోనూ, ఈ-వే బిల్లులపై వాటిని సరుకులతో వెళ్ళినట్టు చూపారు. సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు కనుగొన్నారు. ఇది తెలంగాణలో కనుగొన్న మొదటి రకం GST మోసంగా పరిగణించబడుతోంది, ఇది పన్ను ఎగవేతలో ఓ కొత్త, ప్రమాదకర ధోరణిని సూచిస్తోంది. తనిఖీల సందర్భంగా అధికారులు ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు శ్రీ వికాష్ కుమార్ కీషాన్, శ్రీ రజనీష్ కీషాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీ కి అధికారిక ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించిన మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్కు చెందిన డీఎస్టిఓ మజీద్ హుస్సేన్ గారు మరో మోసాన్ని గుర్తించారు. AP29TA7213 అనే వాహనం జూన్ 2025 నుండి నిశ్చలంగా ఉన్నప్పటికీ, దానిని ఉపయోగించి అనేక ఈ-వే బిల్లులు జారీ చేయబడ్డాయి. ఇది CGST చట్టం, 2017 నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318, 336 ప్రకారం నేరకార్యంగా పరిగణించబడుతుంది. ఈ విషయంపై వాహన యజమానిపై మరో ఫిర్యాదు చేసి FIR నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు. మొత్తంగా, ప్రభుత్వానికి రావలసిన న్యాయమైన పన్ను ఆదాయాన్ని తప్పించేందుకు జరిగే అక్రమ చర్యలపై ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ చేపట్టిందని, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రకాల పన్ను మోసాలను అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ కృషి చేస్తుందని శ్రీమతి కె. హరిత, IAS, వాణిజ్య పన్నుల కమిషనర్, తెలంగాణ రాష్ట్రం పేర్కొన్నారు.