వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

  • ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్
  • ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం
  • వెట్టిచాకిరి రాష్ట్ర సదస్సులో.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణను వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందని, ఆర్థిక సహకారం కూడా అందిస్తుందని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏడాది కేటాయిస్తున్న 3500 ఇందిరమ్మ ఇళ్లలో వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతానని మంత్రి పేర్కొన్నారు. జాతీయ వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ, తెలంగాణ అసంఘటిత కార్మికుల సంఘం, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు బుధవారం నగరంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి వెట్టిచాకిరి, అక్రమ రవాణా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను 8069 434343 ఆవిష్కరించారు. వెట్టి చాకిరిని నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికి కొనసాగడం అత్యంత దురదృష్టకరమని, మానవత్వానికి మచ్చ అని అభివర్ణించారు. ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి ప్రకటించారు. వెట్టి చాకిరి, మానవ అక్రమ రవాణా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. విముక్తి కలిగించిన కార్మికులకు తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200కు పైగా పెట్టి చాకిరి విముక్తి కార్మికులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొన్న బాధల గురించి విన్న తర్వాత ప్రముఖ నటి, బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మాటలు తన మనసును కదిలించాయని, ఈ మహిళలకు తన పూర్తి సహకారం ఉంటుందని అమల ప్రకటించారు. కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరికి పాల్పడుతున్న వ్యాపారులు, గుత్తిదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.