గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో సీనియర్‌ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించనున్నారని, అనంతరం చారిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని, ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్న సందర్భంగా తగిన భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ శాసనసభ, హైకోర్టు, రాజ్‌ భవన్‌, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహాలు వంటి ప్రముఖ ప్రభుత్వ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

గోల్కొండ కోటలో జరిగే అధికారిక వేడుకల్లో భాగంగా రాష్ట్ర వారసత్వం, దేశభక్తిని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు.అత్యవసర పరిస్థితులను దృష్టి పెట్టుకొని అందుకు అవసరమైన అగ్నిమాపక భద్రతా సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు.దినోత్సవ వేడుకలకు ఎలాంటి విద్యుత్‌ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గౌరవం మరియు వైభవాన్ని కాపాడటానికి ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సమాచారశాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.