సిగాచికి పరిశ్రమ యాజమాన్యానికి ప్రొహిబిటెడ్ ఆర్డర్

  • ప్రాణాలు పోయాక ఆర్డరిచ్చిన పరిశ్రమల శాఖ..
  • 54 మంది చనిపోయాక మేల్కొన్న అధికారులు..
  • దుర్ఘటన జరిగి నెల రోజులు పూర్తి..
  • బాధ్యులైన ఏ ఒక్క అధికారిపైనా చర్యల్లేవు ఎందుకు..?
  • నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత ఏది..?
  • ఫ్యాక్టరీల శాఖ, పిసిబి (PCB)లను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్..

సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగాక ఫ్యాక్టరీల శాఖ మేల్కొంది. ఈ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 54 మంది కార్మికుల ప్రాణాలు పోయాక ఆ శాఖ అధికారులు ఇప్పుడు యాజమాన్యానికి ప్రోహిబిటెడ్ ఆర్డరు జారీ చేశారు. ఈ పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని, నిబంధనల ప్రకారం ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు జరగలేదని ఈ ఆర్డర్ లో పేర్కొన్నారు. తిరిగి తాము అనుమతిచ్చేంత వరకు ఇందులో ఉత్పత్తి చేయవద్దని తెలిపింది. ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పరిశీలించాల్సిన ఈ శాఖ అధికారులు ప్రమాదం జరగకముందు ఎందుకు స్పందించలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

బాధ్యులైన అధికారులపై చర్యలేవి..?
ప్రమాదం జరిగిన నెల రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులైన ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిశ్రమను ఇప్పటి వరకు తనిఖీలు చేసిన అధికారులు భద్రతా లోపాలను గుర్తించారా? గుర్తిస్తే వాటిని సరిచేయాలని పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులిచ్చారా? సరి చేయకుండా నిర్లక్ష్యం చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రమాదం జరిగే వరకు ఎందుకు ఉపేక్షించారు? వంటి అంశాలపై ఆ శాఖ ఇప్పటికీ వెల్లడించడం లేదు.

నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత ఏది?
ప్రమాదం జరిగిన వెంటనే సీఎస్ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నలుగురు నిపుణుల బృందాన్ని నియమించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిందా? ఇవ్వలేదా? అనేది తేలలేదు. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

విచారణ జరుగుతోంది..
సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటనపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రొహిబిటెడ్ ఆర్డర్ ఇచ్చాము. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – మోహన్ బాబు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీల శాఖ

సమూల మార్పులు జరగాలి
పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడల్లా కమిటీలు వేయడం.. ఆ కమిటీల నివేదికలను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తక్షణం దృష్టి సారించాలి. ఇందుకు ఫ్యాక్టరీల శాఖ, కాలుష్య నియంత్రణ మండలిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. – కలపాల బాబూరావు, రిటైర్డు సైంటిస్ట్.(సోర్స్:సాక్షి)