నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ,నెల రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూంలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. కేరళలో 99.9% అక్షరాస్యత ఉండగా, మన రాష్ట్రంలో 60 శాతం ఉందని , విద్య, నైపుణ్యాలు పెంపొందింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో పాటు, అన్ని రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నదని అన్నారు. నర్సింగ్ విద్యార్థులు చదువు పైన దృష్టి సారించాలని, సెల్ ఫోన్ జోలికి వెళ్ళవద్దని, ప్రజలకు మంచి సేవలు అందించాలని, సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 4 న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ముఖ్యంగా 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 100 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించామని, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్ఎల్ఎం, ఎం ఫార్మసీ, కోర్సులు,భవనాలు మంజూరు చేశారని ,2026-27 సంవత్సరంలో అడ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నాయని, లా, ఫార్మసీకి మంచి డిమాండ్ ఉందని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో విద్యాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అంతేకాక గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతినెల 6000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్స్ చాలా ఉత్తమమైనదని, వైద్యరంగంలో నర్సింగ్ అనేది మొదటి అదుగు అని అన్నారు. రోగులు ముందుగా స్టాఫ్ నర్స్ ని సంప్రదిస్తారని, డాక్టర్ కన్నా స్టాఫ్ నర్స్ ముఖ్యమని, రోగి ప్రాణాలు కాపాడటంలో స్టాఫ్ నర్స్ పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో మెడికల్ టూరిజం లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అందువల్ల నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకోవాలని ,ప్రస్తుతం నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనంలో స్టాఫ్ క్వార్టర్స్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి తదితరులు ఉన్నారు.