సిగాచి పరిశ్రమ ఘటనపై పూర్తి వివరాలివ్వండి

  • ఇంత వరకు ఎవరినైనా అరెస్టు చేశారా.. ? ‘సిగాచీ’ ఘటనపై ప్రశ్నించిన హైకోర్టు
  • బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి..
  • 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. కాలం గడిచే కొద్దీ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయకూడదని సూచించింది. సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదని, కర్మాగారంలో భద్రతా ప్రమాణాలు లేకపోవడం, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో జాప్యంపై విశ్రాంత శాస్త్రవేత్త కె. బాబూరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కార్మికుల్లో ఎక్కువ మంది ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న వలస కార్మికులని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబీకులకు, గాయపడిన కార్మికులకు పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. విచారణ సందర్భంగా.. ప్రమాదఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దర్యాప్తు పురోగతిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆరా తీశారు. ఇంత వరకు ఎవరినైనా అరెస్టు చేశారా.. అని ప్రశ్నించగా లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రమాద తీవ్రత గమనించిన న్యాయస్థానం.. ఆ రోజున ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల సంఖ్య, వారిలో శాశ్వత, సాధారణ, రోజువారీ వేతన కార్మికుల వివరాలపై ఆరా తీసింది. కార్మికులకు చెల్లించిన పరిహారం వివరాలు కౌంటర్ లో వెల్లడించాలని ఆదేశించింది. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ, నిపుణుల కమిటీ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఈ రెండు కమిటీల నివేదికలపై ప్రమాద దర్యాప్తు ఆధారపడి ఉంటుందా.. అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా, లేదని న్యాయవాది సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతికూల వ్యాజ్యంగా పరిగణించకూడదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అన్ని విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కౌంటర్ దాఖలుకు 4 వారాలు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ కోరగా.. 3 వారాల సమయం సరిపోతుందని ధర్మాసనం పేర్కొంది.